Daggubati: అటో, ఇటో తేల్చుకోండి: దగ్గుబాటి ఫ్యామిలీకి వైసీపీ అల్టిమేట్టం
- బీజేపీలో కొనసాగుతున్న పురందేశ్వరి
- ఇబ్బందిగా ఉందని భావిస్తున్న వైఎస్ఆర్ సీపీ
- ఏదో ఓ పార్టీనే ఎంచుకోవాలని దగ్గుబాటికి చెప్పిన అధిష్ఠానం
గడచిన ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పరుచూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఆయన భార్య పురందేశ్వరి విశాఖ నుంచి ఎంపీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు భార్యాభర్తలు చెరో పార్టీలో కొనసాగేందుకు అభ్యంతరం చెప్పని వైసీపీ, ఇప్పుడు ఏదో ఒక పార్టీని ఎంచుకోవాలని, పురందేశ్వరితో బీజేపీకి రాజీనామా చేయించాలని దగ్గుబాటిపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.
జగన్ సీఎం అయిన తరువాత, బీజేపీ ఏపీ సర్కారుపైనా, జగన్ పైనా చేస్తున్న విమర్శలకు పదును పెట్టగా, పురందేశ్వరి కూడా అదే బాటలో నడుస్తూ, వీలుచిక్కినప్పుడెల్లా జగన్ ను విమర్శిస్తున్నారు. ఈ వ్యవహారం పార్టీలో, ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో కాక రేపుతోంది. దీంతో దగ్గుబాటి ఫ్యామిలీ ఏ పార్టీలో ఉంటారో తేల్చుకోవాలని వైసీపీ అధిష్ఠానం అల్టిమేట్టం ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఇదిలావుండగా, జగన్ తో మాట్లాడాలని దగ్గుబాటి వెంకటేశ్వరరావు గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నా అపాయింట్ మెంట్ లభించడం లేదని సమాచారం. గతంలో పరుచూరులో వైసీపీ ఇన్ చార్జ్ గా ఉండి, దగ్గుబాటి చేరిక తరువాత, టీడీపీలోకి వెళ్లిపోయిన రావి రామనాథం బాబు, ఎన్నికల తరువాత తిరిగి వైసీపీలో చేరారు. ఆపై ఆయనే నియోజకవర్గంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. పార్టీ పనులన్నీ ఆయనకే అప్పగిస్తున్నారు కూడా.
ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న దగ్గుబాటి, తన అనుచరులతో మొత్తం పరిణామాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ అపాయింట్ మెంట్ లభిస్తే, వెళ్లి అక్కడే తుది నిర్ణయం తీసుకోవాలన్నది దగ్గుబాటి ఆలోచనని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.