Tsrtc: ఆర్టీసీ కార్మికులు కేసీఆర్ కు పాలేర్లు కాదు: తమ్మినేని వీరభద్రం
- ఐదో రోజుకు చేరిన టీఎస్సార్టీసీ కార్మికుల సమ్మె
- హైదరాబాద్ లో అఖిలపక్ష సమావేశం
- ప్రొఫెసర్ కోదండరామ్ ఆధ్వర్యంలో సమావేశం
తెలంగాణలో టీఎస్సార్టీసీ కార్మికుల సమ్మె ఐదో రోజుకు చేరింది. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా హైదరాబాద్ లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ప్రొఫెసర్ కోదండరామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం, సీపీఐఎంఎల్ నుంచి పొట్టు రంగారావు, తెలంగాణ జనసేన అధ్యక్షుడు శేఖర్ గౌడ్, ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, థామస్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ, టీఎస్సార్టీసీ కార్మికులు కేసీఆర్ కు పాలేర్లు కాదని విమర్శించారు. ఆర్టీసీ సమ్మెకు సీపీఎం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. రామచంద్రరావు స్పందిస్తూ, సీఎం కేసీఆర్ మాటలు ఆయన అహంకారానికి నిదర్శనం అని ధ్వజమెత్తారు. గతంలో ఆర్టీసీ కార్మికులకు 44 శాతం ఫిట్ మెంట్ ఇచ్చి వారిపై కేసీఆర్ వల్లమాలిన ప్రేమ చూపిస్తున్నట్టు నటించారని విమర్శించారు. ఆర్టీసీ ప్రజా సంక్షేమం కోసం వున్నది లాభనష్టాల కోసం కాదని, కార్మికులను తొలగించే హక్కు కేసీఆర్ కు లేదని అన్నారు.
తెలంగాణ పునర్నిర్మాణానికి నాడు తమ ఉద్యమం నాంది పలికిందని జేఏసీ నేత రాజిరెడ్డి గుర్తుచేసుకున్నారు. ‘బంగారు తెలంగాణ’ అంటూ సీఎం కేసీఆర్ మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని, ప్రజా సంఘాలన్నీ తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు.