India: మోదీ-జిన్ పింగ్ భేటీకి ముందు కశ్మీర్ పై చైనా కీలక వ్యాఖ్యలు
- భారత్ లో రెండు రోజుల పాటు పర్యటించనున్న జిన్ పింగ్
- మహాబలిపురంలో మోదీ, జిన్ పింగ్ భేటీ
- కశ్మీర్ అంశాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న చైనా
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారత పర్యటనకు విచ్చేస్తున్నారు. రెండు రోజుల పాటు మన దేశంలో ఆయన పర్యటించనున్నారు. ఈ నెల 11, 12 తేదీల్లో భారత్ లో ఆయన పర్యటన కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో జిన్ పింగ్ సమావేశం అవుతారు. తమిళనాడులోని మహాబలిపురం వేదికగా వీరిద్దరూ భేటీ కానున్నారు.
ఈ తరుణంలో ఇరువురు నేతల సమావేశాన్ని పురస్కరించుకుని చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. కశ్మీర్ అంశాన్ని భారత్-పాకిస్థాన్ ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. పరస్పర విశ్వాసంతో ఇరు దేశాల మధ్య చర్చలు జరగాలని, రెండు దేశాలకు అది ప్రయోజనాన్ని చేకూర్చుతుందని తెలిపింది. ప్రపంచ దేశాల ఉద్దేశం కూడా ఇదేనని చెప్పింది.
మరోవైపు, మోదీ-జిన్ పింగ్ సమావేశం నేపథ్యంలో మహాబలిపురంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇరువురు నేతలు బస చేసే ప్రాంతాలు, ఫొటో షూట్ జరిగే ప్రాంతాలను భద్రతాదళం ఇప్పటికే పలుమార్లు పరిశీలించింది. అంతర్జాతీయ సమస్యలు, ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు, ఇతర కీలక విషయాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు.