Microsoft: యస్ బ్యాంక్ పై కన్నేసిన బిల్ గేట్స్... 15 శాతం వాటా, డైరెక్టర్ పదవి కొనుగోలు!
- రూ. 2 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్న మైక్రోసాఫ్ట్
- కొనసాగుతున్న చర్చలు
- మరో రెండు కంపెనీలు కూడా పోటీలో
చాలా కాలంగా భారత బ్యాంకింగ్ రంగంలోకి ప్రవేశించాలని చూస్తున్న మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కు ఇప్పుడు నిధుల కోసం అన్వేషిస్తున్న యస్ బ్యాంక్ కనిపించింది. యస్ బ్యాంక్ లో 15 శాతం వాటాను కొనుగోలు చేసి, ఆపై ఓ డైరెక్టర్ పదవిని సొంతం చేసుకునేందుకు మైక్రోసాఫ్ట్ అడుగులు వేస్తోందని తెలుస్తోంది. బ్యాంక్ ఉన్నతాధికారుల సమాచారం ప్రకారం, మైక్రోసాఫ్ట్ తో పాటు, మరో రెండు అగ్రశ్రేణి కంపెనీలు బ్యాంకుతో సంప్రదింపులు జరుపుతున్నాయి.
గత నెల మూడో వారం నుంచి ఈ చర్చలు సాగుతుండగా, మైక్రోసాఫ్ట్ ముందంజలో ఉన్నట్టు సమాచారం. ఈ చర్చలు ఫైనలైజ్ అయితే, 15 శాతం వాటాకు సమానమైన ఈక్విటీ షేర్లను మైక్రోసాఫ్ట్ కు యస్ బ్యాంక్ బదలాయిస్తుంది. ఈ వాటాల ఖరీదు రూ. 2 వేల కోట్ల వరకూ ఉండవచ్చని తెలుస్తోంది. ఈ డీల్ కుదిరితే, డిజిటల్ బ్యాంకింగ్, చెల్లింపుల వ్యవస్థ లను యస్ బ్యాంక్ మరింత విస్తృత పరిచేందుకు అవసరమైన నిధులు సమకూరుతాయి. బ్యాంకు వాటా విక్రయానికి సంబంధించి ఒక ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ ను యస్ బ్యాంక్ నియమించిందని, డీల్ కు సంబంధించిన అన్ని వ్యవహారాలూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ముందుగానే తెలియపరిచామని బ్యాంకు అధికారి ఒకరు తెలిపారు.
అయితే, ఈ విషయంలో అటు మైక్రోసాఫ్ట్ గానీ, ఇటు యస్ బ్యాంక్ గానీ అధికారికంగా స్పందించేందుకు నిరాకరించాయి. వ్యాపార అవసరాలు, అభివృద్ధి ప్రణాళికల అమలు నిమిత్తం మూలధనం సమీకరణకు తాము ప్రయత్నిస్తున్నామని మాత్రం యస్ బ్యాంక్ తెలిపింది.