Jammu And Kashmir: 24 గంటల ఎన్ కౌంటర్ తరువాత... రెండో ఉగ్రవాదిని మట్టుబెట్టిన సైన్యం!

  • నిన్నటి నుంచి ఎన్ కౌంటర్
  • ఉగ్రవాదిని ఫరూల్ గా గుర్తించిన అధికారులు
  • ఆర్టికల్ 370 రద్దు తరువాత క్రియాశీలకం

భారత ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీసులు దాదాపు 24 గంటల పాటు జరిపిన ఎన్ కౌంటర్ అనంతరం అవంతిపొరాలో దాగున్న రెండో ఉగ్రవాదిని మట్టుబెట్టారు. నిన్న తెల్లవారుజామున ఓ ప్రాంతంలో ఇద్దరు టెర్రరిస్టులు దాగున్నారన్న సమాచారాన్ని అందుకున్న సైన్యం, ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, ఒకరిని హతమార్చిన సంగతి తెలిసిందే. ఆపై రెండో ఉగ్రవాది కోసం వేట కొనసాగింది. తుపాకుల చప్పుళ్లు, గ్రనేడ్ పేలుళ్లతో ఆ ప్రాంతం యుద్ధ వాతావరణాన్ని తలపించింది.

ఇక ఈ ఉదయం హతుడైన ఉగ్రవాదిని జైషే మహమ్మద్ కు చెందిన ఉఫైద్ ఫరూల్ అని గుర్తించామని సైన్యాధికారి ఒకరు తెలిపారు. షాపులపై దాడులు చేయడంతో పాటు దేశానికి వ్యతిరేకంగా పనిచేసినట్టు ఇతనిపై పలు కేసులు ఉన్నాయని అన్నారు. ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు తరువాత జరిగిన ఉగ్ర కార్యకాలాపాల్లో ఇతని పాత్ర ఉన్నట్టు తేలిందని తెలిపారు.

స్థానిక యువతను ఉగ్రవాదుల్లో చేరాలంటూ ఫరూల్ ఉసిగొల్పేవాడని అధికారులు తెలిపారు. ఇతని కదలికలపై కొంతకాలంగా నిఘా ఉంచామని అన్నారు. కాగా గత నెల 28 నుంచి ఇప్పటి వరకు నాలుగు ఎన్‌కౌంటర్‌ లను సైన్యం విజయవంతంగా పూర్తి చేసింది.

Jammu And Kashmir
Encounter
Terrorists
  • Loading...

More Telugu News