Chiranjeevi: దేవిశ్రీ ఫస్టాఫ్ చూసి అద్భుతం అన్నాడు, ఆ తర్వాత ఫోన్ రాకపోవడంతో కంగారుపడ్డాను: చిరంజీవి
- హైదరాబాద్ లో 'సైరా' సక్సెస్ మీట్
- ఎవరూ ఫోన్లు చేయకపోవడంతో నిరాశచెందానన్న చిరు
- బన్నీ కృష్ణా జిల్లా రిపోర్ట్ చెప్పినా సంతోషం కలగలేదని వెల్లడి
హైదరాబాద్ లో నిర్వహించిన 'సైరా' సక్సెస్ మీట్ లో చిరంజీవి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నాగార్జున, అఖిల్, సురేఖ స్నేహితులతో కలిసి 'సైరా' చూశానని తెలిపారు. సినిమా చూసిన అనంతరం నాగ్ ఆప్యాయంగా హత్తుకుని భావోద్వేగాలతో కంటతడి పెట్టాడని వెల్లడించారు. అయితే, 'సైరా' రిలీజ్ సందర్భంగా కొన్ని ఉద్విగ్న క్షణాలను గడిపానని చిరు వివరించారు. వాస్తవానికి అక్టోబరు 2 వేకువజామునే అమెరికాలో ఉన్న తన మిత్రుడి నుంచి ఫోన్ కాల్ రావాల్సి ఉందని, ఆ కాల్ రాకపోవడంతో ఆందోళనకు గురయ్యానని తెలిపారు.
కాసేపటికి అమెరికా నుంచి దేవిశ్రీ ప్రసాద్ ద్వారా మెసేజ్ వచ్చిందని, 'ఫస్టాఫ్ అద్భుతం' అని పేర్కొన్నాడని చెప్పారు. ఆ తర్వాత దేవి నుంచి ఫోన్ రాకపోవడంతో సెకండాఫ్ బాగా లేదేమోనన్న కంగారు ఎక్కువైందని అన్నారు. ఉదయం ఆరున్నర గంటలకు కూడా ఎవరూ ఫోన్లు చేయకపోవడంతో నిరాశకు గురయ్యానని, కాఫీ తాగి కూర్చున్నానని తెలిపారు. బన్నీ కృష్ణా జిల్లాలో మంచి టాక్ వస్తోందని మెసేజ్ చేసినా సంతోషం కలగలేదని చెప్పారు.
తాను కోరుకున్న అమెరికా ఫోన్ కాల్ అప్పుడు వచ్చిందని, టికెట్ దొరక్కపోవడంతో తన స్నేహితుడు సినిమా చూడలేదని చెప్పాడని చిరంజీవి వెల్లడించారు. ఆ తర్వాత ఉదయం నుంచి సైరాకు అద్భుతమైన టాక్ రావడం మొదలుపెట్టిందని, వెల్లువలా వస్తున్న స్పందనలు చూసి ఆశ్చర్యపోయానని తెలిపారు.