Telangana: కేసీఆర్ 2014లో ఆర్టీసీకి ఏం చేస్తామని చెప్పారో అవి చేస్తే చాలు!: ప్రొఫెసర్ నాగేశ్వర్
- లాభాలొచ్చే రూట్లేమో ప్రైవేట్ బస్సులకా?
- నష్టాలొచ్చే రూట్లలో ఆర్టీసీ బస్సులు తిప్పుతారా?
- ‘పల్లె వెలుగు’ను ప్రైవేట్ వాళ్లకు ఇచ్చి లాభాలతో నడపమనండి?
టీఎస్సార్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ స్పందించారు. ‘ఏబీఎన్’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, 2014 మే వరకు కేసీఆర్, హరీశ్ రావు, ఇతర టీఆర్ఎస్ నేతలు ఆర్టీసీకి ఏం చేస్తామని చెప్పారో అవి అమలు చేస్తే చాలు అని, అంతకుమించి ఏమీ చేయక్కర్లేదని అన్నారు.
యాభై శాతం ప్రైవేట్ బస్సులకు అనుమతిస్తామని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ, లాభాలు వచ్చే రూట్లనేమో ప్రైవేట్ బస్సులకు అనుమతిస్తున్నారని, నష్టాలొచ్చే రూట్లలో ఏమో ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాలకు తిరిగే ‘పల్లె వెలుగు’, హైదరాబాద్ లో అర్బన్ ట్రాన్స్ పోర్టు బస్సు సర్వీసులను ప్రైవేట్ వాళ్లకు ఇచ్చి.. టికెట్ల ధరలు పెంచకుండా లాభసాటిగా నడపమనండి చూద్దాం అని అన్నారు.