Mohammad Irfan: గౌతమ్ గంభీర్ కెరీర్ ముగిసిపోవడానికి నేనే కారణం: పాకిస్థాన్ బౌలర్ మొహమ్మద్ ఇర్ఫాన్
- నా బౌలింగ్ ఎదుర్కోవడానికి గంభీర్ భయపడ్డాడు
- కళ్లలోకి కళ్లు పెట్టి కూడా చూడలేకపోయాడు
- నా ఫుల్ లెంగ్త్ బంతులకు ఔట్ అయ్యేవాడు
టీమిండియా మాజీ బ్యాట్స్ మెన్ గౌతమ్ గంభీర్ కెరీర్ ముగిసిపోవడంపై పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ ఇర్ఫాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన బౌలింగ్ కు గంభీర్ భయపడేవాడని... అతని వన్డే, టీ20 కెరీర్ ముగిసిపోవడానికి కారణం అదేనని చెప్పాడు. 2012-13 లో భారత్ లో పాకిస్థాన్ పర్యటన సందర్భంగా తన బౌలింగ్ ను ఎదుర్కోవడానికి గంభీర్ భయపడ్డాడని... తన కళ్లలోకి కళ్లు పెట్టి కూడా చూడలేక పోయాడని అన్నాడు. తన వల్లే ఆయన కెరీర్ ముగిసిందనుకుంటున్నానని చెప్పాడు.
తన ఫుల్ లెంగ్త్ బంతులకు గంభీర్ ఔట్ అయ్యేవాడని... తన షార్ట్ పిచ్ బంతులను పుల్ చేయాలనుకున్న ప్రయత్నాలు కూడా ఫలించలేదని ఇర్ఫాన్ తెలిపాడు. ఆ టూర్ లో తన బౌలింగ్ లో గంభీర్ మూడు సార్లు ఔటయ్యాడని చెప్పాడు. నెట్ ప్రాక్టీస్ సమయంలో కూడా తన కళ్లలోకి చూడలేకపోయేవాడని... ఎవరైనా ఎవరికైనా భయపడినప్పుడు వారి కళ్లలోకి చూడరని, పక్కకు తప్పుకుని వెళ్లిపోతుంటారని తెలిపాడు.
ఆ సిరీస్ లో తన బౌలింగ్ కు భారత బ్యాట్స్ మెన్ ఇబ్బంది పడ్డారని... ఈ విషయాన్ని స్వయంగా వారే తనతో చెప్పారని ఇర్ఫాన్ అన్నాడు. వేగవంతమైన తన బంతులను భారత బ్యాట్స్ మెన్ సరిగా చూడలేకపోయారని తెలిపాడు.