Karnataka: నిరుపేద వృద్ధురాలి ఆత్మీయ ఆతిథ్యం... ఆప్యాయంగా స్వీకరించిన ఎస్పీ
- స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ బాస్
- ఆప్యాయంగా పిలిచి జొన్నరొట్టె పెట్టిన అవ్వ
- కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లాలో ఘటన
బిడ్డ ఆకలి గురించి తల్లి ఆలోచిస్తుందంటారు. ఆ అమ్మకాని అమ్మ అలాగే ఆలోచించింది. స్వచ్ఛత కార్యక్రమంలో బిజీగా ఉన్న జిల్లా ఎస్పీకి ఎవరికి తోచింది వారు చెప్పుకుంటుంటే, ఓ నిరుపేద మహిళ మాత్రం ‘బాబూ ఉదయం ఏమైనా తిన్నారా? ఇప్పుడేమైనా తింటారా?’ అంటూ ఆప్యాయంగా అడిగిన మాటలకు ఆయన ఉబ్బితబ్బిబ్బయిపోయారు. ఆ నిరుపేద కాల్చి ఇచ్చిన జొన్నరొట్టెను ఆప్యాయంగా తిన్నారు.
కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని మాన్వి తాలూకా కుర్డి గ్రామంలో ఎస్పీ వేదమూర్తి ఆధ్వర్యంలో నిన్న స్వచ్ఛత కార్యక్రమాన్ని చేపట్టారు. పాడుబడ్డ బావిని శుభ్రం చేసి, దానిచుట్టూ మొక్కలు నాటారు. కార్యక్రమంలో బిజీగా ఉన్న ఎస్పీ వేదమూర్తిని గ్రామానికి చెందిన పాలమ్మ (70) అనే వృద్ధురాలు పలకరించింది.
‘బాగున్నావా అమ్మా’ అని పలకరించిన ఎస్పీని ఏమైనా తింటావా బాబూ? అని అడిగింది. సరే అన్న ఎస్పీ ఆమె పూరిపాకలోకి వెళ్లి పాలమ్మ ఇచ్చిన జొన్నరొట్టెను, శనగపిండి కూరను తిన్నారు.