Nalgonda District: కొట్టుకుపోయిన జలాశయం గేటు...వృథాగా పోతున్న నీరు

  • ఉమ్మడి నల్గొండ జిల్లా మూసీ ప్రాజెక్టు వద్ద ఘటన
  • తెగి పోయిన ఆరో నంబరు గేటు
  • పరీవాహక ప్రాంత ప్రజల్లో ఆందోళన

హైదరాబాద్‌ మూసీ పరీవాహక ప్రాంతంలో నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయం గేటు ఒకటి కొట్టుకుపోయింది. దీంతో భారీగా వరద నీరు నదిలోకి వస్తుండడంతో పరీవాహక ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది. వివరాల్లోకి వెళితే... ఉమ్మడి నల్గొండ జిల్లా కేతేపల్లి వద్ద మూసీ నదిపై 4.4 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం ఉన్న జలాశయం ఉంది. దీనికి 8 రెగ్యులేటరీ గేట్లు, 12 క్రస్టు గేట్లు ఉన్నాయి. డెడ్‌ స్టోరేజీ నీటిని విడుదల చేసే రెగ్యులేటరీ  గేట్లలో ఆరో నంబరు గేటు నిన్న సాయంత్రం కొట్టుకుపోయింది.

దీంతో జలాశయంలో నీరు వృథాగా నదిలోకి వెళ్లిపోతోంది. ఘటన జరిగిన సమయానికి జలాశయంలో 4.3 టీఎంసీల నీరుంది. జలాశయం సామర్థ్యం 645 అడుగులు కాగా 644.5 అడుగుల మేర నీరుంది. ఈ ప్రాజెక్టు పరిధిలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని 42 గ్రామాల పరిధిలో 33 వేల ఎకరాలు సాగవుతోంది.

డెడ్‌ స్టోరేజీ గేటు కొట్టుకు పోవడంతో జలాశయంలో నీరు అడుగంటే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సమాచారం తెలియడంతో మంత్రి జగదీశ్‌రెడ్డి ఘటనపై సమాచారం అడిగి తెలుసుకున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News