lalita jewellery: లలిత జ్యువెలర్స్ చోరీ కేసులో దొంగ అరెస్ట్.. 4.5 కిలోల బంగారు నగలు స్వాధీనం
- నగలతో బైక్‌పై వస్తూ పోలీసులకు చిక్కిన దొంగ
- నిందితులు ఇద్దరూ ఒకే గ్రామం వారే
- పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు
తిరుచ్చిలోని లలిత జ్యువెలర్స్‌లో జరిగిన భారీ దొంగతనం కేసులో ఓ నిందితుడు పోలీసులకు చిక్కాడు. తిరువారూర్ సమీపంలోని విళమల్ అడియక్కమంగలం చెక్ పోస్టు వద్ద గురువారం రాత్రి తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను చూసి బైక్‌పై వస్తున్న ఇద్దరు దొంగలు వెనక్కి తిరిగి పరారయ్యారు. గుర్తించి అప్రమత్తమైన పోలీసులు వారిని వెంబడించారు. కిలోమీటరు దూరం వెంబడించిన తర్వాత ఓ దొంగ అట్టపెట్టతో పోలీసులకు పట్టబడ్డాడు. అందులో 4.5 కిలోల బంగారు నగలు కనిపించడంతో పట్టుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.
నిందితుడిని తిరువారూర్‌కు చెందిన మణికంఠన్ (32)గా గుర్తించారు. పరారీలో ఉన్న మరో దొంగ కూడా అదే గ్రామానికి చెందిన సురేశ్ అని పోలీసులు తెలిపారు. చోరీ అనంతరం నిందితులు ఇద్దరూ నగలను పంచుకున్నట్టు పోలీసులు తెలిపారు. తిరుచ్చిలోని లలిత జ్యువెలర్స్ షోరూంలో బుధవారం తెల్లవారుజామున భారీ దొంగతనం జరిగింది. గోడకు కన్నం వేసి షోరూంలోకి చొరబడిన ఇద్దరు యువకులు ముఖాలకు మాస్క్ వేసుకుని నగలను దోచేశారు. మొత్తం రూ.13 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు.