Bharat: భారత్ ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించడంతో తన వంటమనిషికి సూచనలు ఇచ్చిన బంగ్లాదేశ్ ప్రధాని
- భారత్ లో పెరిగిన ఉల్లి ధరలు
- ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం
- స్పందించిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా
భారత్ లో ఉల్లి ధరల ప్రభావం పొరుగు దేశాలపైనా పడుతోంది. స్వదేశీ మార్కెట్లో ఉల్లి అందుబాటులో ఉంచడం కోసం భారత్ తన ఎగుమతులపై నిషేధం విధించింది. దీనిపై బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా స్పందించారు. భారత్ ఇలాంటి నిర్ణయాలు తీసుకునేముందు కాస్త ముందుగా సమాచారం ఇస్తే బాగుంటుందని, తగినన్ని ఉల్లిగడ్డలు ఇంట్లో ఉంచుకునేవాళ్లమని చమత్కరించారు.
అంతేకాకుండా, తమ వంటమనిషికి కూడా స్పష్టమైన సూచనలు చేశామని, ఉల్లిపాయలు లేని వంటలు చేయమని చెప్పాల్సి వచ్చిందని తెలిపారు. "మీరు హఠాత్తుగా ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించారు. మాకెంతో కష్టం వచ్చిపడింది. మీరు గనుక ముందస్తు సమాచారం ఇచ్చివుంటే మాకెంతో ఉపయుక్తంగా ఉండేది" అంటూ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగిన భారత్-బంగ్లాదేశ్ వాణిజ్య సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.