village volunteers: ఏపీలో గ్రామ వలంటీర్ల దసరా మామూళ్ల సందడి.. వేటేసిన అధికారులు!
- బాధితుల ఫిర్యాదుతో సీరియస్‌గా తీసుకున్న అధికారులు
- నలుగురు వలంటీర్ల తొలగింపు
- కృష్ణా జిల్లాలో ఘటన
ప్రభుత్వ ఉద్దేశం, లక్ష్యం ఏదైనా తమ తీరు మాత్రం అదే అని నిరూపించిన కొందరు గ్రామ వలంటీర్లు దసరా మామూళ్ల వసూలుకు సిద్ధపడి ఉద్యోగం పోగొట్టుకున్నారు. పింఛన్ బాధితులు కొందరు ఫిర్యాదు చేయడంతో అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. కృష్ణా జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే... జిల్లాలోని బందరు మండలం రుద్రవరం ఎస్సీ వాడలో పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని నలుగురు వలంటీర్లు చేపట్టారు. లబ్ధిదారుల వద్దకు వెళ్లిన వలంటీర్లు పింఛన్ అందజేసిన అనంతరం దసరా మామూళ్లు ఇవ్వాలని కోరారు. కొందరి వద్ద నుంచి రూ.50లు చొప్పున తీసుకున్నారు.
అయితే కొందరు లబ్ధిదారులు మాత్రం మామూళ్లు ఇవ్వడానికి నిరాకరించడమేకాక విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో విచారణ జరిపిన బందరు ఎంపీడీఓ జి.వి.సూర్యనారాయణ వలంటీర్లపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలడంతో నలుగురిని విధుల నుంచి తొలగించారు. ఈ వ్యవహారంలో ఉదాసీనంగా వ్యవహరించిన వీఆర్‌ఏపై కూడా చర్య తీసుకోవాలని తహసీల్దారుకు సూచించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారుల వద్దకే చేర్చాలన్న ఉద్దేశంతో జగన్ సర్కారు రూపొందించిన వలంటీర్ల వ్యవస్థ ఏర్పడి రెండు నెలలు గడవక ముందే ఇటువంటి సంఘటనలు వెలుగు చూస్తుండడంతో మున్ముందు ఎలా ఉంటుందో అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.