Sania Mirza: అమ్మాయిలు ఆటలాడితే అందవిహీనంగా మారిపోతారని నన్ను భయపెట్టేవారు: సానియా మీర్జా
- వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరైన సానియా
- ఢిల్లీలో జరిగిన కార్యక్రమం
- ఎంతో నిరుత్సాహపరిచారన్న టెన్నిస్ క్వీన్
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా ఢిల్లీలో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మహిళలు-లింగవివక్ష అనే అంశంపై మాట్లాడారు. బాల్యంలో తాను టెన్నిస్ క్రీడను ఎంచుకున్నప్పుడు కుటుంబ సభ్యులు, బంధువులు చాలా నిరుత్సాహ పరిచారని తెలిపారు. అమ్మాయిలు ఆటలు ఆడితే నల్లగా మారిపోయి, అందవిహీనంగా తయారవుతారని చెప్పేవాళ్లని, నిన్ను ఎవరూ పెళ్లి చేసుకోరని భయపెట్టేవాళ్లని వివరించారు.
అప్పటికి తన వయసు ఎనిమిదేళ్లు అని, తాను ఇంకా చిన్నపిల్లనే కాబట్టి ఇవేం పట్టించుకోరాదని ఆ సమయంలో నిర్ణయించుకున్నానని తెలిపారు. తాను అలాంటి అభిప్రాయాలకు అప్పుడే కాదు ఎప్పుడూ విలువ ఇవ్వలేదని, ఆటపైనే దృష్టి పెట్టానని వెల్లడించారు. ఎందుకోగానీ, ఇలాంటి అభిప్రాయాలు మన సంస్కృతిలో బాగా పాతుకుపోయాయని, ఈ పద్ధతిలో మార్పురావాలని ఆకాంక్షించారు.