KCR: ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరిన కేసీఆర్
- రేపు మోదీతో భేటీ కానున్న కేసీఆర్
- రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ నిధులను పెంచాలని విన్నవించనున్న సీఎం
- వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరనున్న కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఆయన హస్తినకు పయనమయ్యారు. నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాని అయ్యాక ఆయన కేసీఆర్ తో భేటీ కానుండటం ఇదే తొలిసారి. రేపు ఉదయం 11 గంటలకు మోదీతో కేసీఆర్ సమావేశం కాబోతున్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వ నిధులను పెంచాలని ఈ సందర్భంగా మోదీని కేసీఆర్ కోరనున్నారు. రాష్ట్రంలో ఏదో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విన్నవించనున్నారు. విభజన హామీలను అమలు చేయాలని, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరనున్నారు.