East Godavari District: గోదావరిలో పెరిగిన వరద...బోటు వెలికితీత ప్రయత్నాలకు బ్రేక్
- ప్రవాహ ఉద్ధృతిలో ప్రమాదమన్న భావన
- పనులు నిలిపివేసిన ధర్మాడి సత్యం బృందం
- మూడు రోజులుగా కచ్చులూరు వద్ద ఆపరేషన్
గోదావరిలో మునిగిపోయిన బోటు వెలికితీత పనులకు మళ్లీ బ్రేక్ పడింది. గోదావరిలో వరద ఉద్ధృతి పెరగడంతో కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం పనులు నిలిపివేసింది. పాపికొండల అందాలు తిలకించేందుకు ఉత్సాహపడిన పర్యాటకులతో బయలుదేరిన వశిష్ట రాయల్ బోటు తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద పందొమ్మిది రోజుల క్రితం మునిగి పోయిన విషయం తెలిసిందే.
ఈ ప్రమాదంలో 26 మంది బతికి బయటపడగా చాలామంది ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మృతదేహాల ఆచూకీ కూడా లభించక పోవడంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతూ తమ వారి చివరి చూపుకోసం ఎదురు చూస్తున్నారు. నాలుగు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం కాకినాడకు చెందిన సత్యం బృందానికి బోటు వెలికితీత బాధ్యతలు అప్పగించింది.
రెండు రోజుల క్రితం రెండు కిలోమీటర్ల ఇనుపతాడు నదిలోకి జారవిడిచిన బృందం లంగరుకు ఏదో బరువైన వస్తువు తగలడంతో దాన్ని బయటకు లాగే ప్రయత్నం చేసింది. అయితే రోప్ తెగిపోవడంతో వారి ప్రయత్నాలకు బ్రేక్ పడింది. మళ్లీ నిన్నటి నుంచి వెలికితీత ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే గోదావరిలో వరద పెరగడంతో మళ్లీ వెలికితీత ప్రయత్నాలకు బ్రేక్ పడింది.