Odisha: చేతబడి అనుమానం.. వృద్ధుల పళ్లు పీకి హింసించిన వైనం!

  • ఒడిశాలోని గంజాం జిల్లా గోపపూర్‌లో ఘటన
  • 22 మంది మహిళలు సహా 29 మంది అరెస్ట్
  • పోలీసులు గ్రామంలోకి రాకుండా కారంపొడి చల్లి అడ్డుకునే ప్రయత్నం

ఒడిశాలోని గంజాం జిల్లా గోపపూర్‌లో సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. చేతబడి నెపంతో ఆరుగురు వృద్ధుల పళ్లు పీకి వారితో అశుద్ధం తినిపించారు. గ్రామంలో రెండు వారాల వ్యవధిలో వివిధ కారణాలతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. గత నెల 28న మరికొందరు అస్వస్థతకు గురయ్యారు. చేతబడి కారణంగానే ఇలా జరుగుతోందని భావించిన గ్రామస్థులు స్థానికంగా నివసించే ఆరుగురు వృద్ధులను పట్టుకుని వారి పళ్లు పీకేశారు. అనంతరం వారితో అశుద్ధం తినిపించారు. తర్వాత వారిని ఓ భవనంలో బంధించారు.

సమాచారం అందుకున్న ఎస్పీ బ్రిజేష్‌రాయ్ బుధవారం తన బృందంతో వెళ్లి బాధితులను రక్షించి ఆసుపత్రికి తరలించారు. అయితే, గ్రామంలోకి పోలీసులు చొరబడకుండా పొలిమేర్లలో కళ్లలో కారం చల్లి అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టి బలవంతంగా గ్రామంలోకి ప్రవేశించారు. 22 మంది మహిళలు సహా మొత్తం 29 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురు పురుషులు గ్రామం నుంచి పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Odisha
Ganjam dist
blackmagic
Crime News
  • Loading...

More Telugu News