Telangana: తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ సంఘాల చర్చలు విఫలం.. సమ్మె యథాతథం

  • సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం నుంచి రాని స్పష్టత
  • ఎల్లుండి నుంచి సమ్మె తప్పదన్న కార్మిక సంఘాలు
  • పండుగ వేళ ప్రజలను ఇబ్బంది పెట్టొద్దన్న త్రిసభ్య కమిటీ

తెలంగాణ ఆర్టీసీ సంఘాలు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐఏఎస్ అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీ మధ్య జరిగిన తొలి దశ చర్చలు విఫలమయ్యాయి. కార్మిక సంఘాలు ప్రభుత్వం ముందు 26 డిమాండ్లు ఉంచగా, వాటి పరిష్కారంపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో సమ్మెను యథాతథంగా కొనసాగించాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి.

త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఎప్పుడు ఇస్తుందన్న దానిపై ఓ కాలపరిమితి అంటూ లేకపోవడం కూడా చర్చలు విఫలం కావడానికి మరో కారణంగా తెలుస్తోంది. అయితే, నేడు మరోసారి జరిగే చర్చలకు హాజరవుతామని, కాకపోతే ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లలో కొన్నింటికైనా ప్రభుత్వం నుంచి హామీ రావడంతోపాటు నివేదిక కచ్చితంగా ఎప్పుడు ఇస్తారో చెప్పాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. హామీ ఇస్తేనే సమ్మెను విరమిస్తామని సంఘాలు స్పష్టం చేశాయి. ప్రభుత్వం నుంచి హామీ రాకుంటే మాత్రం ఎల్లుండి నుంచి సమ్మె తప్పదని తేల్చి చెప్పాయి.  

ఆర్టీసీ కార్మిక సంఘాల డిమాండ్లపై త్రిసభ్య కమిటీ స్పందించింది. కార్మిక సంఘాలు ప్రభుత్వం ముందుంచిన 26 డిమాండ్లను పరిశీలించినట్టు పేర్కొంది. వీటిలో చాలావరకు డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని, అయితే, కొన్ని మాత్రం కష్టతరమైన డిమాండ్లు ఉన్నాయని తెలిపింది. కాబట్టి వాటి పరిష్కారానికి సమయం అవసరమని, దసరా పండుగ వేళ ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని పేర్కొంది. సమ్మె విరమించుకోవాలని కోరింది.

మరోపక్క, గతంలో వేసిన కమిటీలకు కూడా దిక్కుమొక్కు లేకుండా పోయిందని, ఇప్పుడు ఈ కమిటీని ఎలా నమ్మాలని కార్మిక సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. కమిటీ ఎన్ని రోజుల్లో నివేదిక ఇస్తుంది.. దానిపై ప్రభుత్వం ఎంత కాలంలో చర్యలు తీసుకుంటుందన్న దానిపైనే సమ్మె విరమణ ఆధారపడి ఉంటుందని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి.

  • Loading...

More Telugu News