sita devi: రావణుడి పాత్ర వేసిన బీజేపీ ఎమ్మెల్యే.. సీతను ‘మేరీ జాన్’ అని పిలిచి విమర్శల పాలు!

  • రామ్‌లీలా నాటకంలో ఎమ్మెల్యే రాజ్‌కుమార్ రావణుడి పాత్ర
  • ‘సీతా మేరీ జాన్’ అని సంబోధించిన ఎమ్మెల్యే
  • విరుచుకుపడుతున్న కాంగ్రెస్

‘రామ్‌లీలా’ నాటకంలో రావణుడి పాత్ర వేసిన బీజేపీ ఎమ్మెల్యే.. సీతాదేవిని ‘మేరీ జాన్’ అని సంబోధించడం వివాదాస్పదమైంది. నిర్వాహకులు వారిస్తున్నా.. ఆయన అలాగే పిలవడం మరిన్ని విమర్శలకు కారణమైంది. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఉత్తరాఖండ్‌లో ఆదివారం ‘రామ్‌లీలా’ నాటకాన్ని ప్రదర్శించారు. ఈ నాటకంలో రుద్రాపూర్ బీజేపీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ తుక్రాల్ రావణాసురుడి వేషం వేశారు.

ఇక నాటకం రసవత్తరంగా సాగుతోంది. ఈ క్రమంలో సీతాదేవి, రావణునికి మధ్య సన్నివేశాలు మొదలయ్యాయి. సీతాదేవిని చూసిన రావణుడి పాత్రధారి ‘సీతా మేరీ జాన్’ అని సంబోధించారు. అది విన్న ప్రేక్షకులు ఒక్కసారిగా గొల్లుమన్నారు. దీంతో నిర్వాహకులు అభ్యంతరం తెలిపారు. అయినప్పటికీ పట్టించుకోని ఎమ్మెల్యే మరోమారు ఆమెను అలానే సంబోధించారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. సీతారాములపై ఎమ్మెల్యే రాజ్‌కుమార్‌కు ఉన్న గౌరవం ఏపాటిదో ఈ వీడియో చూసి అర్థం చేసుకోవచ్చని పేర్కొంది. రావణుడు ఎప్పుడూ సీతాదేవితో అసభ్యంగా ప్రవర్తించలేదని.. సీతాదేవీ.. అని మాత్రమే సంబోధించేవాడని గుర్తు చేసింది. రాజ్‌కుమార్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ విమర్శలపై ఎమ్మెల్యే రాజ్‌కుమార్ స్పందించారు. నాటకంలో భాగంగానే అలా పిలిచానని, నాటకంలో మాట్లాడింది రావణుడి పాత్రధారే కానీ, తాను కాదని సమర్థించుకున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News