Haryana: హర్యానా కాంగ్రెస్‌లో భగ్గుమన్న అసంతృప్తి.. సంచలన ఆరోపణలు చేసిన రాష్ట్ర కాంగ్రెస్ మాజీ చీఫ్
- మరో మూడు వారాల్లో హర్యానాలో ఎన్నికలు
- సోహ్నా టికెట్‌ను రూ.5 కోట్లకు అమ్మేసుకున్నారన్న అశోక్ తన్వర్
- సోనియా నివాసం ఎదుట కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
మరో మూడు వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ హర్యానా కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఏళ్ల తరబడి పార్టీని మోస్తూ వచ్చిన తమను కాదని రెండు వారాల క్రితం పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇస్తున్నారంటూ రాష్ట్ర కాంగ్రెస్ మాజీ చీఫ్ అశోక్ తన్వర్ ఆరోపించారు. అర్హులు కానివారికి టికెట్లు ఇస్తున్నారంటూ సోనియాగాంధీ నివాసం ఎదుట నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి తన్వర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
గురుగావ్‌లోని సోహ్నా అసెంబ్లీ టికెట్‌ను 5 కోట్ల రూపాయలకు అమ్మేసుకున్నారని తన్వర్ సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు జెండా మోసిన వారిని కాదని కొత్త వారికి టికెట్లు ఇస్తే ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం బాధ్యతా రాహిత్యానికి ఇది ప్రత్యక్ష నిదర్శనమని ధ్వజమెత్తారు. రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలతో తనకు వ్యక్తిగతంగా సమస్యలు ఉన్నప్పటికీ పార్టీ ముఖ్యమని భావించి వాటిని పక్కన పెట్టానని తన్వర్ పేర్కొన్నారు.