Kodandaram: టీఆర్ఎస్ విధానాలను ఎండగట్టేందుకే కాంగ్రెస్ కు మద్దతిస్తున్నాం: కోదండరాం ప్రకటన
- హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో తమ వైఖరిని వెల్లడించిన కోదండరాం
- టీఆర్ఎస్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలంటూ పిలుపు
- సహజ వనరులు కొల్లగొడుతున్నారంటూ విమర్శలు
హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో తమ మద్దతు కాంగ్రెస్ పార్టీకేనని తెలంగాణ జన సమితి (టీజేఎస్) పార్టీ అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. టీఆర్ఎస్ విధానాలను ఎండగట్టేందుకే తాము ఈ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతిస్తున్నట్టు తెలిపారు. టీఆర్ఎస్ సాగిస్తున్నది నియంతృత్వ పాలన అని, రాష్ట్రంలో ప్రజల భాగస్వామ్యంతో పరిపాలన జరగడంలేదని విమర్శించారు.
ప్రభుత్వమే స్వార్థ ప్రయోజనాల కోసం సహజ వనరులను లూటీ చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ మంత్రివర్గం అంతా హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో గెలుపే అజెండాగా రంగంలోకి దిగిందని కోదండరాం విమర్శించారు. టీఆర్ఎస్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.