East Godavari District: ధర్మాడి బృందం నేతృత్వంలో.. గోదావరిలో బోటు వెలికితీతకు కొనసాగుతున్న యత్నాలు!

  • తొలి రెండురోజుల ప్రయత్నం వృథా 
  • ఐరన్‌ రోప్‌ తెగిపోవడంతో ఆగిన పనులు
  • ఈరోజు మరోసారి లంగరు వేయాలని నిర్ణయం

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద ప్రయాణికులతో వెళ్తూ మునిగిపోయిన బోటు వెలికితీత ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందానికి రాష్ట్ర ప్రభుత్వం వెలికితీత బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. పద్దెనిమిది రోజుల క్రితం ప్రయాణికులతో వెళ్తున్న బోటు మునిగిపోయింది. ప్రయాణికుల్లో మరో 16 మంది జాడ ఇప్పటికీ తెలియదు. వారి కోసం కుటుంబ సభ్యులు కన్నీటితో ఎదురు చూస్తున్నారు.  వీరంతా బోటులోనే చిక్కుకుని చనిపోయి ఉంటారన్న అభిప్రాయం నెలకొంది.

దీంతో బాధిత కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం బోటు వెలికితీత బాధ్యతను సత్యం బృందానికి అప్పగించింది. ఈ మేరకు  రెండు రోజుల క్రితమే రంగంలోకి దిగిన 25 మంది సభ్యుల బృందం రెండు కిలోమీటర్ల పొడవున్న ఇనుప తాడును బోటు మునిగిన ప్రాంతంలోకి వదిలింది. ఏదో బరువైన వస్తువు తాడుకు తగలడంతో బయటకు తీసే ప్రయత్నం ప్రారంభించింది.

అయితే ఐరన్‌ రోప్‌ మధ్యలోనే తెగిపోవడంతో వీరి ప్రయత్నాలకు బ్రేక్‌ పడింది. దీంతో ఈరోజు మరోసారి లంగరువేసి బోటు కోసం ప్రయత్నించాలని సత్యం బృందం సిద్ధమవుతోంది. వీరి ప్రయత్నాలు ఇలావుంటే 'బోటు మునిగిపోయిన సమయంలో గోదావరిలో ప్రవాహం ఉద్ధృతంగా ఉంది. అందువల్ల బోటు మునిగిపోయిన చోటే ఉండడం అసాధ్యం. దిగువకు కొట్టుకుపోయి కూడా ఉండవచ్చు' అని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో బోటు కోసం ఘటనా స్థలిలో జరుగుతున్న ప్రయత్నాలు వృథాయేనని వీరి అభిప్రాయం. మరి సత్యం బృందం తరువాత అడుగు ఎటువైపు పడుతుందో చూడాలి.

  • Loading...

More Telugu News