Mahabubabad District: పక్కా ప్లాన్! భర్తను మటన్ కోసం పంపి హత్య చేయించిన భార్య

  • వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని హత్య
  • ప్రియుడితో కలిసి పన్నాగం
  • నిందితులకు అరదండాలు వేసిన పోలీసులు

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడన్న దుగ్ధతో పక్కా ప్లాన్ చేసి భర్తను హత్య చేయించిందో ఇల్లాలు. గత నెల 21న మహబూబాబాద్ జిల్లాలోని రేగడితండాలో జరిగిన హత్యకేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. వారి వివరాల ప్రకారం.. పట్టణంలోని మంగలికాలనీకి చెందిన ఇన్నారపు నవీన్-శాంతి భార్యాభర్తలు. శాంతి రెండున్నరేళ్లుగా వెంకటేశ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలిసిన నవీన్ భార్యను మందలించాడు. దీంతో అతడిని అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి శాంతి పథకం వేసింది.

అందులో భాగంగా గత నెల 21న రేగడితండాలోని తన తల్లి ఇంటికి వెళ్లి మటన్ తీసుకురావాల్సిందిగా భర్తను పంపింది. భార్య పన్నాగం తెలియని నవీన్ స్కూటీపై రేగడితండా బయలుదేరాడు. దారిలో కాపుకాసిన శాంతి ప్రియుడు వెంకటేశ్, అతడి స్నేహితుడు పద్దం నవీన్‌లు నవీన్‌పై దాడిచేసి, ఇనుప రాడ్డుతో తలపై మోది హత్య చేశారు. అనంతరం రోడ్డు ప్రమాదంగా నమ్మించేందుకు స్కూటీని అతడిపై వేసి అక్కడి నుంచి పరారయ్యారు.

నవీన్ సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలం నుంచి సేకరించిన మద్యం సీసాలపై ఉన్న బార్‌కోడ్, భార్య సెల్‌ఫోన్ సంభాషణల ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

Mahabubabad District
wife
husband
murder
  • Loading...

More Telugu News