Jagan: జగన్ జైల్లో ఉన్నప్పుడే తన బలమేంటో చూపించారు... ఇప్పుడు ప్రభుత్వాధినేతగా మరింత ప్రభావితం చేస్తారు: సీబీఐ

  • వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ జగన్ పిటిషన్
  • విచారణ చేపట్టిన సీబీఐ న్యాయస్థానం
  • గట్టిగా వాదనలు వినిపించిన సీబీఐ

వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కల్పించాలంటూ ఏపీ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీబీఐ తీవ్రస్థాయిలో తన వాదనలు వినిపించింది. అక్రమాస్తుల కేసులో జగన్ జైల్లో ఉన్నప్పుడే తన బలమేంటో చూపించారని, సాక్షులను ప్రభావితం చేశారని సీబీఐ వివరించింది. ఇప్పుడాయన ప్రభుత్వాధినేతగా సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశాలున్నాయని పేర్కొంది.

వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరే క్రమంలో ఆయన వాస్తవాలు దాచిపెట్టి న్యాయస్థానంలో పిటిషన్ వేశారని సీబీఐ ఆరోపించింది. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర విభజనతో ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని, ఇది అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నమేనని సీబీఐ స్పష్టం చేసింది.

సీఎంగా ఉన్న ఆయనకు అనేక సౌకర్యాలు కల్పిస్తారని, ఆ సౌకర్యాలతో ఆయన హైదరాబాద్ వరకు రావడం పెద్ద కష్టమేమీ కాదని తెలిపింది. జగన్ వ్యక్తిగతంగా హాజరు కావడం ఈ కేసులో ఎంతో ముఖ్యమని, ఆయన పిటిషన్ ను తిరస్కరించాలని సీబీఐ కోరింది.

Jagan
Andhra Pradesh
CBI
Court
  • Loading...

More Telugu News