subramanian swamy: పీవీని ప్రశంసల్లో ముంచెత్తిన బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి.. ‘భారతరత్న’కు ఆయన అర్హుడేనన్న సీనియర్ నేత

  • దేశం  ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు మన్మోహన్‌లాంటి నిపుణుడిని ఆర్థిక మంత్రిని చేశారు
  • కశ్మీర్ మొత్తం మాదే అని తీర్మానించిన ఘనత పీవీదే
  • రిపబ్లిక్ డే నాటికైనా పీవీకి ‘భారతరత్న’ ప్రకటించాలి

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ‘భారతరత్న’కు అర్హుడని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. దేశం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో మన్మోహన్‌సింగ్‌ లాంటి ఆర్థిక నిపుణుడిని ఆర్థికమంత్రిగా ఎంచుకోవడం పీవీ వివేకానికి నిదర్శనమని ప్రశంసించారు.

మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్నప్పటి కంటే ఆర్థికమంత్రిగానే ఎక్కువ సంస్కరణలు తీసుకురాగలిగారని అన్నారు. అయితే, ఇది మన్మోహన్‌సింగ్ గొప్పతనం కాదని, ఆ క్రెడిట్ అంతా పీవీకే చెందుతుందన్నారు. వచ్చే గణతంత్ర దినోత్సవం నాటికైనా ఆయనకు ‘భారతరత్న’ ఇవ్వాల్సిందేనని సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు.

ముంబైలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కేవలం ఆర్థిక సంస్కరణలు తెచ్చి వదిలిపెట్టకుండా కశ్మీర్ మొత్తం మాదే అని తీర్మానించిన ఘనత కూడా పీవీదేనని సుబ్రహ్మణ్యస్వామి కొనియాడారు. అసంపూర్తిగా మిగిలిన ఎజెండా పీవోకే స్వాధీనమే అని పీవీ నిర్భయంగా చెప్పారని గుర్తు చేశారు.

కాగా, గత నెల 11న ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యస్వామి మాట్లాడుతూ పీవీ ‘భారతరత్న’కు అర్హుడేనని అన్నారు.  బాబ్రీ మసీదు కింద ఓ ఆలయం ఉండేదన్న విషయం శాస్త్రీయంగా తేలితే ఆ ప్రాంతాన్ని తమ ప్రభుత్వం హిందువులకు ఇచ్చేస్తుందని సుప్రీంకోర్టుకు పీవీ తెలియజేశారని సుబ్రహ్మణ్యస్వామి గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News