Hyderabad: తప్పుడు ప్రచారంతో నగర ప్రశాంతతను దెబ్బతీస్తే కఠిన చర్యలు: హైదరాబాద్ సీపీ అంజనీకుమార్
- ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా కొందరు ప్రచారం
- సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టింగ్‌లు
- కశ్మీర్‌లో ఎటువంటి అల్లర్లు జరగడం లేదు
కశ్మీర్‌లో అల్లర్లు జరుగుతున్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టింగ్‌లు పెట్టి హైదరాబాద్ నగరంలో కల్లోలం సృష్టించే ప్రయత్నం జరుగుతోందని, అటువంటి చర్యలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని కమిషనర్ ఆఫ్ పోలీస్ అంజనీకుమార్ హెచ్చరించారు. కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరాలపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఆఫ్ఘానిస్థాన్, ఇరాక్‌లో ఎప్పుడో జరిగిన ఘటనల వీడియోలను వాట్సాప్‌లో పెట్టి కశ్మీర్ అల్లర్లుగా ప్రేరేపిస్తున్నారని, ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉందని, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఆ ప్రశాంతతను, అభివృద్ధిని కాపాడుకునేందుకు అంతా సహకరించాలని, శాంతిభద్రతలు కాపాడేందుకు కలిసి నడవాలని కోరారు.