mahatma gandhi: ట్రంప్ ‘మోదీ జాతిపిత’ వ్యాఖ్యలపై తుషార్ గాంధీ అసంతృప్తి

  • హౌడీ-మోదీ కార్యక్రమంలో ట్రంప్ వ్యాఖ్యలు
  • ఆ వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్న తుషార్  
  • కరెన్సీ నోట్లు, స్వచ్ఛభారత్ పోస్టర్లకే గాంధీ పరిమితమయ్యారన్న ముని మనవడు

భారత ప్రధాని నరేంద్రమోదీని ‘భారత జాతిపిత’గా అభివర్ణిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై మహాత్మాగాంధీ ముని మనవడు తుషార్ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారం రోజుల క్రితం అమెరికాలో జరిగిన ‘హౌడీ-మోదీ’ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ మాట్లాడుతూ.. మోదీని ‘భారత జాతిపిత’గా కీర్తించారు. తాజాగా, ఈ వ్యాఖ్యలపై తుషార్ గాంధీ స్పందించారు.

ఆదివారం ఓ జాతీయ వార్తా సంస్థతో మాట్లాడిన ఆయన.. జాతిపిత స్థానాన్ని మరొకరితో భర్తీ చేయాలని ఎందుకు అనుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. ఆ వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలిపెడుతున్నట్టు చెప్పారు. అమెరికాకు జాతిపితలాంటి వారైన జార్జ్ వాషింగ్టన్ వంటి వారి స్థానాన్ని ట్రంప్ భర్తీ చేసేందుకు ఇష్టపడవచ్చని తుషార్ వ్యంగ్యంగా అన్నారు.

మహాత్మాగాంధీ ఆలోచనలు, సిద్ధాంతాలను ప్రతిచోట ఆచరించవచ్చని, కానీ దురదృష్టవశాత్తు వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాపు 150వ జయంత్యుత్సవాలను ప్రభుత్వం మొక్కుబడిగా నిర్వహిస్తోందని విమర్శించారు. కరెన్సీ నోట్లపైనా, స్వచ్ఛ భారత్ పోస్టర్లకే మహాత్మాగాంధీ పరిమితమయ్యారని తుషార్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.

mahatma gandhi
tushar gandhi
Donald Trump
Narendra Modi
  • Loading...

More Telugu News