Crime News: కేటుగాడిని పట్టించిన టాటూ... పోలీసులకు చిక్కిన గొలుసు దొంగతనాల నిందితుడు
- వ్యసనాలకు బానిసై దొంగతనాల బాట
- అతని ఒంటిపై ఉన్న టాటూ గుర్తించిన ఓ బాధితురాలు
- దీని ఆధారంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఎంతటి తెలివైన దొంగైనా ఎక్కడో ఏదో ఒక పొరపాటు చేస్తాడు. అదే పోలీసులకు తీగలా దొరుకుతుంది. ఆ తీగతో డొంకంతా కదుపుతారు. ఈ గొలుసు దొంగతనాల నిందితుడు అలాగే చిక్కాడు. తన ఒంటిపై ముచ్చటపడి వేయించుకున్న టాటూయే అతన్ని పట్టించింది. వివరాల్లోకి వెళితే...కర్నూల్ జిల్లా నంద్యాల మండలం కానాల గ్రామానికి చెందిన దూదేకుల మస్తాన్‌వలి వ్యసనాలకు లోనై దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఇతని తండ్రి రైల్వే కళాసీగా పనిచేసి చనిపోయాడు. దీంతో అతని గుర్తింపు కార్డు, లైసెన్స్ బిళ్ల తన పేరున మార్చుకున్నాడు. పోలీసులు అనుమానించినపుడల్లా వాటిని చూపించి తప్పించుకునే వాడు.
మస్తాన్‌వలికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకంటే ప్రాణమైన మస్తాన్‌వలి అతని పేరు చేతిపైనా, మెడపైనా టాటూగా వేయించుకున్నాడు. ఈ నేపధ్యంలో కొన్నిరోజు క్రితం కొలిమిగుండ్ల మండలం హనుమంతు గుండలో ఓ వృద్ధురాలి మెడలో గొలుసును మస్తాన్‌వలి తెంచి పారిపోయాడు. ఆ సందర్భంలో వృద్ధురాలితోపాటు ఉన్న ఆమె బంధువు మస్తాన్‌వలి ఒంటిపై ఉన్న టాటూ గుర్తించింది. అదే విషయాన్ని పోలీసులకు తెలిపింది.
ఈ ఘటన తర్వాత పోలీసులు నంద్యాల ప్రాంతంలో మట్కా ఆడుతున్న ఓ ముఠాను పట్టుకున్నారు. ఆ ముఠా సభ్యుల్లో ఒకరి సెల్‌ఫోన్‌లో ఉన్న గ్రూప్ ఫొటోలో టాటూ ఉన్న వ్యక్తిని పోలీసులు గుర్తించారు. వృద్ధురాలి బంధువు టాటూ గురించి చెప్పిన విషయం నమోదు చేసిన పోలీసులు అనుమానంతో ఈ ఫొటోలో ఉన్న మస్తాన్‌వలిని పిలిపించి విచారించడంతో అసలు విషయం బయటపడింది.
మస్తాన్‌వలి కొలిమిగుండ్ల, ఆళ్లగడ్డ సమీపంలోని చింతకుంట్ల, రుద్రవరం దగ్గర కొండమనేనిపల్లి, అంకిరెడ్డిపల్లి, కోటపాడు, నల్లగట్ల, కోవెలకుంట్ల, సంజామ, చిన్నకంబళూరు, బనగానపల్లి, హుస్సేనాపురంలలో పలు దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 30 తులాల బంగారం, వాహనాలు, సెల్‌ఫోన్ పోలీసులు సీజ్ చేశారు.