Yuvraj Singh: తన రిటైర్మెంట్ వెనకున్న అసలు కారణాన్ని బయటపెట్టిన యువరాజ్ సింగ్
- నన్ను తొలగించేందుకు సాకులు వెతికారు
- యోయో టెస్టును పాసయ్యే సరికి తట్టుకోలేకపోయారు
- మరిన్ని అవకాశాలు ఇచ్చి ఉంటే కొనసాగి ఉండేవాడిని
ఇటీవల క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తన రిటైర్మెంట్ వెనకున్న కారణాలను బయటపెట్టాడు. ఓ జాతీయ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువరాజ్ మాట్లాడుతూ.. తనకు జట్టు మేనేజ్‌మెంట్ నుంచి మద్దతు కరవైందని ఆవేదన వ్యక్తం చేశాడు. 2011 తర్వాత మరో ప్రపంచకప్ ఆడలేకపోవడం తనను తీవ్రంగా బాధించిందన్న యువరాజ్.. తనకు సరైన సమయంలో అవకాశాలు ఇచ్చి ఉంటే మరిన్ని రోజులు క్రికెట్ ఆడి ఉండేవాడినన్నాడు. యోయో టెస్టు పాసైనా జట్టులోకి తీసుకోకపోవడం తనను ఒకింత ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు.
36 ఏళ్ల వయసులో యోయో టెస్టు పాస్ అవుతానని ఊహించని మేనేజ్‌మెంట్.. పాసయ్యేసరికి సాకులు వెతికిందని, దేశవాళీ క్రికెట్ ఆడాలన్న నెపంతో తనపై వేటేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. 16 ఏళ్లపాటు జట్టుకు ఆడిన తనను జట్టు నుంచి ఎందుకు తొలగిస్తున్నదీ కూర్చోబెట్టి చెప్పొచ్చని, కానీ అలా చేయలేదన్నాడు. సెహ్వాగ్, జహీర్‌ఖాన్‌ల విషయంలోనూ ఇదే జరిగిందని యువరాజ్ పేర్కొన్నాడు.