Imran Khan: చైనాలో ముస్లింలపై జరుగుతున్న దారుణాలపై ఎందుకు మాట్లాడటం లేదు?: ఇమ్రాన్ కు అమెరికా సూటి ప్రశ్న
- కశ్మీర్ గురించి ఇమ్రాన్ చేస్తున్న వ్యాఖ్యలు పాకిస్థాన్ కు లాభించవు
- కశ్మీర్ ను దాటి చైనాలో జరుగుతున్న దారుణాల గురించి మాట్లాడాలి
- చైనాలో 10 లక్షల మంది ముస్లింలు అణచివేతకు గురవుతున్నారు
జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్ ను దోషిగా నిలబెట్టడానికి పాకిస్తాన్ ఎన్నో ప్రయత్నాలు చేసినా... అన్నింటా విఫలమైంది. అంతర్జాతీయ సమాజం ముందు ఏకాకిగా నిలబడింది. ఒక్క చైనా మాత్రమే పాక్ పక్షాన నిలబడింది.
మరోవైపు, ఐక్యరాజ్యసమతి సాధారణ సమావేశాల సందర్భంగా కశ్మీర్ లో ముస్లింలు అణచివేతకు గురవుతున్నారని, మానవహక్కుల హననం జరుగుతోందంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి గగ్గోలు పెట్టారు. ఈ వ్యాఖ్యలపై అమెరికా తీవ్రంగా స్పందించింది.
ముస్లింల విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్న ఇమ్రాన్ ఖాన్... కశ్మీర్ ను దాటి చైనాలో జరుగుతున్న దారుణాల గురించి కూడా మాట్లాడాలని అమెరికా ఉన్నతాధికారి అలైస్ వెల్స్ అన్నారు. కశ్మీర్ గురించి ఇమ్రాన్ చేస్తున్న వ్యాఖ్యలు పాకిస్థాన్ కు ఏ మాత్రం లబ్ఢిని చేకూర్చబోవని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమ చైనాలో దాదాపు 10 లక్షల మంది ఉయిగర్లు, టర్కీ మాట్లాడే ఇతర ముస్లింలు తీవ్ర అణచివేతకు గురవుతున్నారని చెప్పారు. వీరందరినీ చైనా ప్రత్యేక క్యాంపుల్లో నిర్బంధించి, హింసిస్తోందని విమర్శించారు.
చైనాలో అణచివేతకు గురవుతున్న ముస్లింల గురించి కూడా ఇమ్రాన్ ఖాన్ మాట్లాడాలని అలైస్ అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో చైనాలో అణచివేతకు గురవుతున్న ముస్లింలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని చెప్పారు.
మరోవైపు ఈ అంశంపై మాట్లాడేందుకు ఇమ్రాన్ ఖాన్ తిరస్కరించారు. చైనాతో తమకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని... ఈ అంశంపై తాము ప్రైవేటుగానే చర్చిస్తామని చెప్పారు.