Shiromani Akali Dal: బీజేపీ దారుణంగా మోసం చేసింది.. హర్యానాలో ఒంటరిగానే పోటీ చేస్తాం: శిరోమణి అకాలీదళ్

  • హర్యానాలోని ఏకైక శిరోమణి అకాలీదళ్ ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకున్న బీజేపీ
  • సంకీర్ణ ధర్మానికి బీజేపీ తూట్లు పొడిచిందని మండిపడ్డ ఎస్ఏడీ
  • బీజేపీతో తెగదెంపులు చేసుకుంటున్నామంటూ ప్రకటన

సంకీర్ణ ధర్మానికి బీజేపీ తూట్లు పొడిచిందని శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) మండిపడింది. హర్యానాలో తమకు ఉన్న ఏకైక ఎమ్మెల్యేను లాగేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. వచ్చే నెల హర్యానా అసెంబ్లీకి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆ పార్టీ అధినేత సుఖ్ బీర్ సింగ్ బాదల్ స్పష్టం చేశారు. కలన్ వాలీ నియోజకవర్గ అకాలీదళ్ ఏకైక ఎమ్మెల్యే బాల్ కౌర్ సింగ్ నిన్న ఢిల్లీలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బాల్ కౌర్ సింగ్ మాట్లాడుతూ, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పై ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో అత్యున్నత, నీతివంతమైన పాలనను అందిస్తున్నారని కితాబిచ్చారు.

ఈ నేపథ్యంలో శిరోమణి అకాలీదళ్ అధికార ప్రతినిధి దల్జీత్ సింగ్ చీమా మాట్లాడుతూ బీజేపీపై నిప్పులు చెరిగారు. హర్యానా ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకాలపై చర్చలు జరుపుతున్న తరుణంలో... తమ ఎమ్మెల్యేను బీజేపీ చేర్చుకోవడం దారుణమని అన్నారు. హర్యానాలో బీజేపీతో తెగదెంపులు చేసుకుంటున్నామని చెప్పారు. బీజేపీ అనైతిక చర్యలకు పాల్పడిందని మండిపడ్డారు. మరోవైపు, పంజాబ్ లో అకాలీదళ్ కు 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. లోక్ సభలో ఇద్దరు, రాజ్యసభలో ముగ్గురు ఎంపీలు ఉన్నారు. బీజేపీకి నమ్మకస్తురాలైన మిత్రపక్షంగా ఇంతకాలం అకాలీదళ్ వ్యవహరించింది.

  • Loading...

More Telugu News