Karnataka: సుప్రీంకోర్టులో తేలని కర్ణాటక ఎమ్మెల్యేల అనర్హత అంశం.. ఉప ఎన్నిక వాయిదా

  • 15 మంది రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు
  • సుప్రీం తలుపు తట్టిన ఎమ్మెల్యేలు
  • వచ్చే నెల 21న జరగాల్సిన ఉప ఎన్నికలు వాయిదా

కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశంపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉండడంతో రాష్ట్రంలోని 15 అసెంబ్లీ స్థానాలకు జరగాల్సిన ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించిన కేసులో రెండు రోజులపాటు సుప్రీంకోర్టులో జరిగిన సుదీర్ఘ వాదనల అనంతరం ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో తీర్పు కోసం వేచి చూస్తామని, ఆ తర్వాతే ఎన్నికలకు వెళ్తామని సుప్రీంకోర్టుకు ఈసీ తెలిపింది.

కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన 15 మంది ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్ రమేశ్ కుమార్ అనర్హత వేటు వేశారు. స్పీకర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో రెండు రోజుల వాదనల అనంతరం ఉప ఎన్నికలను వాయిదా వేయాలని ఈసీ నిర్ణయించింది.

కర్ణాటకలోని 15 అసెంబ్లీ స్థానాలతోపాటు మహారాష్ట్ర, హరియాణాలలో ఉప ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే నెల 21న పోలింగ్ నిర్వహించి 24న లెక్కింపు చేపట్టనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే, అనర్హత అంశం తేలకపోవడంతో కర్ణాటకలో ఉప పోరును ఈసీ వాయిదా వేసింది.

Karnataka
jds
Congress
Supreme Court
by-election
  • Loading...

More Telugu News