Aparna Lavakumar: క్యాన్సర్ పేషెంట్ల కోసం తన శిరోజాలను దానం చేసిన మహిళా పోలీస్ ఆఫీసర్
- కేరళ పోలీసాఫీసర్ వినూత్న దానం
- క్యాన్సర్ బాధితులకు విగ్గుల కోసం జుట్టు ఇచ్చేసిన వైనం
- సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న అపర్ణ
కేరళలో ఓ పోలీస్ అధికారిణి శిరోముండనం చేయించుకుని, పొడవైన తన శిరోజాలను పట్టుకుని నిల్చున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె పేరు అపర్ణ లవకుమార్. ఆమె వయసు 46 సంవత్సరాలు. త్రిస్సూరు జిల్లాలోని ఇరింజాలకుడ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తోంది. ఈ సీనియర్ పోలీస్ అధికారిణికి సామాజిక స్పృహ మెండుగా ఉంది. అందుకే క్యాన్సర్ పేషెంట్ల కోసం తన శిరోజాలను దానం చేసి శభాష్ అనిపించుకుంది. క్యాన్సర్ వ్యాధి బాధితుల కోసం విగ్గుల తయారీకి తన జుట్టును ఇస్తున్నానని అపర్ణ పేర్కొన్నారు.
క్యాన్సర్ తో పోరాడుతున్న 5వ తరగతి చిన్నారిని చూసిన తర్వాత తనకీ ఆలోచన వచ్చిందని తెలిపారు. క్లాస్ రూములో ఇతరులు తనవైపు వింతగా చూస్తుంటే ఆ క్యాన్సర్ బాధిత చిన్నారి ఎలా భరించగలదు? అనే భావన తనలో కలిగిందని, అలాంటివాళ్ల కోసం తాను జుట్టును దానం చేయడం చాలా చిన్న విషయమని, ఇలాంటి సాధారణమైన విషయాల పట్ల తనను అభినందించాల్సిన అవసరంలేదని అపర్ణ స్పష్టం చేశారు. అపర్ణ విషయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ కూడా స్పందించారు. అపర్ణ చర్యను వేనోళ్ల కీర్తించారు.