uday train: విజయవాడ, విశాఖ మధ్య ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణం మొదలు!
- విశాఖ-విజయవాడ మధ్య వారానికి ఐదు రోజుల రాకపోకలు
- పూర్తి ఏసీ సదుపాయం ఉన్న డబుల్ డెక్కర్
- ఆధునిక సదుపాయాలతో ప్రయాణికులకు సరికొత్త అనుభూతి
ఉదయ్ డబుల్ డెక్కర్ ఏసీ రైలు ప్రయాణం మొదలయ్యింది. విశాఖ-విజయవాడ-విశాఖ మధ్య వారానికి ఐదు రోజులపాటు రాకపోకలు జరిపే ఈ రైలు తొలి ప్రయాణాన్ని కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి సురేష్ చెన్నబసప్ప అంగాడి విశాఖ రైల్వే స్టేషన్‌లో ఈరోజు ఉదయం జెండా ఊపి ప్రారంభించారు. పూర్తి ఏసీ సదుపాయం, డైనింగ్, టీవీ, అనౌన్స్‌మెంట్ వంటి ఆధునిక సదుపాయాలతో ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని ఈ రైలు ఇస్తుంది.
సోమ, మంగళ, బుధ, శుక్ర, శనివారాల్లో ఉదయం 5.45 గంటలకు (22701) రైలు బయలుదేరుతుంది. దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు మీదుగా ఉదయం 11.15 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది.
విజయవాడలో సాయంత్రం 5.30 గంటలకు (22702) బయలుదేరి రాత్రి 11 గంటలకు విశాఖ చేరుకుంటుంది. రైలులో 9 డబుల్ డెక్కర్ కోచ్‌లు, రెండు పవర్ కార్లు ఉన్నాయి. విజయవాడ, విశాఖ మధ్య టికెట్టు ధర 525 రూపాయలుగా నిర్ణయించారు.