visakhaparnam: సాహితీవేత్త చందు సుబ్బారావుకు గుర్రం జాషువా అవార్డు
- సీనియర్ రచయిత, విమర్శకుడు, అరసం కార్యదర్శికి దక్కిన గౌరవం
- 28న ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ప్రదానం
- సుబ్బారావు స్వగ్రామం గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని చదలవాడ
సీనియర్ రచయిత, విమర్శకుడు, అరసం రాష్ట్ర కార్యదర్శి చందు సుబ్బారావుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గుర్రం జాషువా అవార్డు దక్కింది. గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని చదలవాడ సుబ్బారావు స్వగ్రామం. ఆంధ్ర విశ్వవిద్యాలయం జియో ఫిజిక్స్ ఆచార్యునిగా పనిచేసిన ఆయన నాలుగు దశాబ్దాలుగా విశాఖలోనే ఉంటున్నారు. 2006లో పదవీ విరమణ చేసిన అనంతరం కూడా చందు నగరంలోనే స్థిరపడ్డారు. మేనమామ, రచయిత శివరామకృష్ణ ప్రభావంతో సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్న చందు సుబ్బారావు తనపై శ్రీశ్రీ, గురజాడ, గుర్రం జాషువాల ప్రభావం ఉందంటారు.
ఆరు నవలలు, 40 కథలు, ఐదు విమర్శనాత్మక గ్రంథాలు రాశారు. ఆయన రాసిన ‘చందన చర్చ‘ సుబ్బారావుకు మంచి పేరు తెచ్చిపెట్టింది. నాలుగు పీహెచ్‌డీలు చేసిన సుబ్బారావు 45 పేపర్లు సమర్పించారు. నాలుగు థీసిస్‌లు రాశారు. ఈనెల 28వ తేదీన అమరావతిలో జరిగే కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా చందు సుబ్బారావు ఈ అవార్డును అందుకోనున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాషువా రచనలంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన ప్రభావం తనపై ఉందని, అటువంటి తనకు ఆయన పేరుతో ఉన్న అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఇప్పటికే ఎన్నో అవార్డులు అందుకున్నా ఈ అవార్డు తన సాహితీ జీవితంలో ప్రత్యేకమని చెప్పారు.