Telugudesam: మాజీ ఎమ్మెల్యే ‘పంచకర్ల’కు వైసీపీ గ్రీన్‌సిగ్నల్: దసరాకు ముహూర్తం?
- సైకిల్ దిగేందుకు సిద్ధమవుతున్న టీడీపీ నేత
- గత ఎన్నికల్లో యలమంచిలి నుంచి ఓటమి
- కొన్నాళ్లుగా ఎంపీ విజయసాయిరెడ్డితో మంతనాలు
విశాఖ జిల్లాకు చెందిన ఓ టీడీపీ సీనియర్ నేత పార్టీ వీడేందుకు రంగం సిద్ధమయింది. గత సార్వత్రిక ఎన్నికల్లో యలమంచిలి నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్టుపై పోటీ చేసి ఓటమిపాలైన పంచకర్ల రమేష్‌బాబు వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. గత కొన్నాళ్లుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆయన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డితో టచ్‌లో ఉంటూ పార్టీ మారేందుకు మంతనాలు జరిపినట్టు సమాచారం. అటువైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో విజయ దశమికి వైసీపీ కండువా కప్పుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
నిన్న రమేష్‌బాబు చినముషిడివాడలోని శారదా పీఠానికి వెళ్లి స్వరూపానందేంద్ర సరస్వతి దర్శించుకున్నట్లు సమాచారం. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమని అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపనతో 2009లో రాజకీయ ప్రవేశం చేసిన పంచకర్ల ఆ ఎన్నిల్లో పెందుర్తి నుంచి పోటీచేసి ఎమ్మెల్యే అయ్యారు. అనంతరం పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనం కావడంతో కాంగ్రెస్ నాయకుడిగా మారారు.
ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో టీడీపీలో చేరారు. రాష్ట్ర విభజన అనంతరం 2014 ఎన్నికల్లో యలమంచిలి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. పార్టీ రూరల్ జిల్లా అధ్యక్షునిగా కూడా పనిచేశారు. గత ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజక వర్గం నుంచి టీడీపీ టికెట్టు ఆశించినా అధిష్ఠానం గంటాకు ఆ స్థానం కేటాయించడంతో యలమంచిలి నుంచే పోటీ చేయక తప్పలేదు.
అయితే కన్నబాబురాజు చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మాజీ మంత్రి, విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనుచరుడిగా పంచకర్లకు పేరుంది.