Karnataka: కర్ణాటక నేత డీకే శివకుమార్ కు చుక్కెదురు.. బెయిల్ నిరాకరించిన కోర్టు!
- మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న డీకే
- బెయిల్ పిటిషన్ పై రోజ్ అవెన్యూ న్యాయస్థానం విచారణ
- డీకే అనారోగ్యంతో ఉన్నారన్న న్యాయవాది
మనీ లాండరింగ్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి డీకే శివకుమార్ జ్యుడీషియల్ రిమాండులో వున్న విషయం తెలిసిందే. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ శివకుమార్ దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం నేడు కొట్టివేసింది. ఢిల్లీలోని రోజ్ అవెన్యూ న్యాయస్థానం ఈ పిటిషన్ పై విచారణ చేసింది.
శివకుమార్ ఆరోగ్యం బాగుండలేదని, ఛాతి నొప్పి, జ్వరంతో బాధపడుతున్న ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని డీకే తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అయినప్పటికీ, బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. కాగా, మనీ లాండరింగ్ కేసులో విచారణ నిమిత్తం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు డీకే శివకుమార్ ని ఈ నెల 3న అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు రిమాండు విధించగా, తీహార్ జైలుకు తరలించారు.