Kodela: చనిపోయిన రోజు కోడెల తిన్న ఆహారాన్ని ఫోరెన్సిక్ పరీక్షకు పంపిన పోలీసులు!
- కోడెల ఆత్మహత్యపై పోలీసుల దర్యాప్తు షురూ
- సాంకేతిక, ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించిన పోలీసులు
- వాంగ్మూలం ఇవ్వాలని కోడెల కుమారుడు, కుమార్తెను కోరిన పోలీసులు
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. చనిపోయిన రోజున కోడెల తీసుకున్న అల్పాహారాన్ని పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. కోడెల తీసుకున్న అల్పాహారంలో విషం ఉందో, లేదో తెలపాలని పోలీసులు ఫోరెన్సిక్ నిపుణులను కోరారు. అంతేకాకుండా, కోడెల చివరిసారి ఫోన్ లో మాట్లాడింది గన్ మన్ ఆదాబ్ తోనే అని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు సాంకేతిక, ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించారు.
కోడెల ఆత్మహత్య కేసులో భాగంగా 18 మంది సాక్షులను పోలీసులు విచారించారు. అయితే, కోడెల శివప్రసాదరావు పర్సనల్ సెల్ ఫోన్ ను కుటుంబ సభ్యులు పోలీసులకు ఇవ్వలేదని తెలుస్తోంది. దర్యాప్తులో భాగంగా కోడెల తనయుడు శివరాం, కుమార్తె విజయలక్ష్మిలను వాంగ్మూలం ఇచ్చేందుకు రావాల్సిందిగా పోలీసులు కోరారు. 11 రోజుల తర్వాత వస్తామని వారిరువురు పోలీసులకు తెలియజేశారు.