Pawan Kalyan: ఏపీలో జల సంరక్షణ అవసరం చాలా ఉంది: పవన్ కల్యాణ్
- పవన్ తో పర్యావరణవేత్త రాజేంద్ర సింగ్ భేటీ
- వరదలు, వర్షాలు ఉన్నా జల నిర్వహణ సమర్థంగా లేదు
- నదీ పరీవాహక ప్రాంతాల్లోనూ భూగర్భ జలాలు దెబ్బ తింటున్నాయి
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జల సంరక్షణ అవసరం చాలా ఉందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ తో ప్రముఖ పర్యావరణవేత్త, జల సంరక్షకుడు 'వాటర్ మేన్ ఆఫ్ ఇండియా' రాజేంద్ర సింగ్ ఈరోజు భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో యురేనియం కోసం అన్వేషణ, జల సంరక్షణ, వాటర్ బాడీస్ ను కాపాడుకోవడంలో పాలకుల వైఫల్యాలపై చర్చించారు. నల్లమలలో యురేనియం కోసం అన్వేషణ, ఫలితంగా ప్రజల్లో నెలకొన్న ఆందోళన, జనసేన ఆధ్వర్యంలో చేపట్టిన రౌండ్ టేబుల్ సమావేశంలో చెంచులు, పర్యావరణవేత్తలు వెల్లడించిన అభిప్రాయాలను ఆయనతో పంచుకున్నారు.ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, వరదలు, వర్షాలు ఉన్నా జల నిర్వహణ సమర్థంగా లేదని అన్నారు. ప్రకాశం, శ్రీకాకుళం, అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి వలసలు పెరిగిపోతున్నాయంటే కారణం వ్యవసాయ రంగం దెబ్బ తినడమేనని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోని నదీ పరీవాహక ప్రాంతాల్లోనూ భూగర్భ జలాలు దెబ్బ తింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జనసేన అధికార ప్రతినిధి, జల్ బిరాదరి జాతీయ కన్వీనర్ బొలిశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు.