Jammu And Kashmir: యుద్ధం రాబోతోందా?...సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి సైనిక బలగాల తరలింపు!
- కశ్మీర్‌కు వాయు, రోడ్డు మార్గాల్లో తరలింపు
- నోరు మెదపని అధికారులు
- ఏం జరుగుతోందో అని ఉత్కంఠ
జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణ రద్దు తర్వాత సరిహద్దు రాష్ట్రంలో టెన్షన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఓ వైపు యుద్ధం తప్పదని పాక్ హూంకరిస్తుంటే, మరోవైపు పీఓకేను కూడా స్వాధీనం చేసుకుంటామని భారత్ సవాల్ చేస్తోంది.
ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి మూడురోజులుగా సైనిక బలగాలను రోడ్డు, వాయు మార్గాల్లో కశ్మీర్‌కు తరలిస్తుండడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నిజంగా యుద్ధమే వస్తోందా అన్న చర్చ సాగుతోంది. సైనిక బలగాల తరలింపుపై అధికారులు నోరు మెదపడం లేదు. దేశభద్రతకు సంబంధించిన అంశం కాబట్టి వివరాలు అడగవద్దని చెబుతున్నారు. వాస్తవానికి 370 ఆర్టికల్ రద్దు తర్వాత నుంచి భారీగా బలగాలను కశ్మీర్‌కు తరలిస్తున్నారు.