Crime News: అప్పుతీర్చమన్నందుకు.. తండ్రిని చంపేసిన కొడుకు!
- భోజనం చేస్తుండగా వచ్చి దారుణం
- సాయపడిన నిందితుడి మామ, బావమరిది
- మిస్టరీ ఛేదించిన తాడిపత్రి పోలీసులు
అప్పు రూపంలో ఇల్లు పోతుందన్న కక్షతో కన్నతండ్రినే హత్యచేశాడో ప్రబుద్ధుడు. భోజనం చేస్తున్న తండ్రిపై మామ, బావమరిది సాయంతో దాడిచేసి గొంతుకోసి మరీ కిరాతకంగా చంపేశాడు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం కాల్వగడ్డ వీధిలో జరిగిన ఈ ఘాతుకం మిస్టరీని పోలీసులు ఛేదించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ వీధికి చెందిన విశ్రాంత హెడ్‌కానిస్టేబుల్ లక్ష్మన్న (66)ను రెండు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేశారు. అగ్నిమాపక శాఖలో పనిచేసిన లక్ష్మన్న, దస్తగిరమ్మ దంపతులు. వీరికి హరికుమార్, హరికృష్ణ అని ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు అనంతపురంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతూ అక్కడే హాస్టల్లో ఉంటున్నాడు. చిన్నకొడుకు పెళ్లి చేసుకుని కడప జిల్లా పులివెందులలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు.
పుట్టపర్తిలో పనిచేస్తుండగా ఎనిమిదేళ్ల క్రితం లక్ష్మన్న పదవీ విరమణ చేశాడు. దస్తగిరమ్మ భర్తతో విభేదాల కారణంగా 15 ఏళ్ల క్రితమే విడిచి వెళ్లిపోయింది. దీంతో లక్ష్మన్న మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో లక్ష్మన్న హత్య జరగడంతో హంతకులెవరన్నది మిస్టరీగా మారింది. అయితే, ఆస్తి విషయమై గొడవలు జరుగుతుండడంతో కొడుకులే ఇందుకు కారణమై ఉంటారన్న ఉద్దేశంతో ఆ దిశగా పోలీసులు కూపీలాగడంతో మిస్టరీ విడిపోయింది.
లక్ష్మన్న చిన్నకొడుకు హరికృష్ణే ఈ హత్యకు పాల్పడ్డాడని తేల్చారు. లక్ష్మన్న పదవీ విరమణ చేసినప్పుడు వచ్చిన మొత్తాన్ని కొడుకులు ఇద్దరికీ సమానంగా పంచాడు. హరికృష్ణ ఇల్లు కట్టుకుంటానని చెప్పి అన్న హరికుమార్కు వాటాగా వచ్చిన మొత్తం నుంచి ఐదు లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఇన్నేళ్లవుతున్నా అప్పు తీర్చక పోవడంతో పెద్ద కొడుకు తరపున లక్ష్మన్న కోర్టును ఆశ్రయించాడు. కోర్టు తీర్పు లక్ష్మన్నకు అనుకూలంగా వచ్చే పరిస్థితి ఉండడంతో తండ్రి అడ్డు తొలగించుకోవాని హరికృష్ణ నిర్ణయించాడు.
ఇందుకు తనకు పిల్లనిచ్చిన మామ బోడోళ్ల తిరుపాల్, భార్య సోదరుడు కుళ్లాయప్పతో కలిసి లక్ష్మన్న ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయంలో తండ్రి భోజనం చేస్తుండగా చంపేశాడు. మామ, బావమరిది తండ్రి కాళ్లు, చేతులు పట్టుకోగా హరికృష్ణ చాకుతో తండ్రి గొంతుకోసి హత్యచేశాడు. అనంతరం తలుపు వేసి పరారయ్యారు. పెద్దకొడుకు హరికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసు తమదైన శైలిలో విచారించడంతో వాస్తవం బయటపడింది. దీంతో నిందితులు ముగ్గురినీ పోలీసులు అరెస్టు చేశారు.