Narendra Modi: ఇది హృదయం ఉప్పొంగే రోజు: ‘హౌడీ-మోదీ’ సభలో ట్రంప్
- మోదీ ప్రపంచ సేవకుడు.. ఆయనతో కలిసి పనిచేస్తా
- మోదీ సంస్కరణలు భేష్
- భారత విలువలు అమెరికా విలువలతో కలిసిపోతాయి
గతరాత్రి హ్యూస్టన్‌లో జరిగిన ‘హౌడీ-మోదీ’ సభలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. మోదీని గొప్ప నాయకుడిగా, ప్రపంచ సేవకుడిగా అభివర్ణించారు. భారత విలువలు, సంస్కృతి అమెరికా విలువలతో కలిసి పోతాయని అన్నారు. భారత్-అమెరికా స్వప్నాలను సాకారం చేసేందుకు మోదీతో కలిసి పనిచేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. ఆర్థిక సంస్కరణలతో మోదీ ప్రభుత్వం 30 లక్షల మందికి పేదరికం నుంచి విముక్తి కల్పించిందన్న ట్రంప్.. 40 కోట్ల మంది బలమైన మధ్య తరగతి భారత్‌కున్న గొప్ప ఆస్తి అని కొనియాడారు.
‘హౌడీ-మోదీ’ సభకు 50 వేలమందికిపైగా హాజరు కావడం స్ఫూర్తిదాయకమన్న ట్రంప్.. ఇది హృదయం ఉప్పొంగే రోజని అన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా అమెరికాలో భారత్ పెట్టుబడులు పెడుతోందని అన్నారు. భారత ఇంధన అవసరాలకు అమెరికా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. టెక్సాస్ నుంచి అవసరమైన చమురు ఉత్పత్తులు భారత్‌కు అందుతాయని స్పష్టం చేశారు.
అమెరికాలో ఆర్థిక అసమానతలు వేగంగా తగ్గుతున్నాయని ట్రంప్ తెలిపారు. గత నాలుగేళ్లలో ఏకంగా కోటీ నలభై లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించినట్టు చెప్పారు. సరిహద్దు భద్రత విషయంలో భారత్‌కు సహకరిస్తామని హామీ ఇచ్చారు. భారత సంతతి అమెరికన్లు దేశ అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. శాస్త్రసాంకేతిక రంగాల్లో వారి కృషి శ్లాఘనీయమన్నారు.