Chandrababu: చంద్రబాబు, వేమూరి రాధాకృష్ణపై చట్టపరమైన చర్యలకు వెనుకాడం: జోగి రమేశ్
- గ్రామ సచివాలయ పరీక్ష పత్రాలు లీకవడం అబద్ధం
- పేపర్ ఎలా లీకైందో, అది ఎవరు ఇచ్చారో చెప్పాలి?
- రాధాకృష్ణ, చంద్రబాబు మాకు సమాధానం చెప్పాలి
గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో అవకతవకలు జరిగాయని వస్తున్న ఆరోపణలను వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ ఖండించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, గ్రామ సచివాలయ పరీక్ష పత్రాలు లీకయ్యాయన్న అసత్య కథనం ప్రసారం చేశారని, దీనికి ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. తమ వర్గ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన వేమూరి రాధాకృష్ణ, తన పేపర్ లో ఏవిధంగా ప్రచురించాలో చెప్పాలి? లేకపోతే చట్టపరంగా క్రిమినల్ చర్యలు చేపడతామని హెచ్చరించారు.
‘వేమూరి రాధాకృష్ణ, చంద్రబాబు.. మీ పేపర్ లో వచ్చిన వార్త నిజమైందా? కాదా? అది నిజమైతే, పేపర్ ఎలా లీకైందో, అది ఎవరు ఇచ్చారో ప్రజలకు సమాధానం చెప్పాలి. రాధాకృష్ణా! నీ దగ్గర ఉన్న నిజాలన్నీ తీసుకురా. మా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల తరపున రేపోమాపో మీ పత్రిక దగ్గరకు వస్తాం. నిజాలన్నీ బయటపెట్టాలి. నిజాలు బయటపెట్టకపోతే వేమూరి రాధాకృష్ణ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. వేమూరి రాధాకృష్ణ, చంద్రబాబునాయుడు మాకు సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. ఈ విషయాలను బహిరంగ పరచకపోతే వేమూరి రాధాకృష్ణ, చంద్రబాబుపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వెనుకాడమని హెచ్చరించారు.