Nara Lokesh: మీ ఎమ్మెల్యేలు జనంలోకి వెళ్లడానికి సిగ్గుపడుతున్నారు... ఇప్పటికైనా నోరు తెరిచి మాట్లాడండి జగన్ గారూ!: లోకేశ్ విసుర్లు
- పరీక్ష పేపర్ల లీక్ పై లోకేశ్ స్పందన
- సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు
- రాష్ట్రానికి మీ పాలన శాపం అంటూ వ్యాఖ్యలు
ఈ 100 రోజుల్లోనే మీ పాలన ఎలాంటిదో ప్రజలకి అర్థమైపోయింది అంటూ సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. మీ పాలన రాష్ట్రానికి శాపం, రాష్ట్ర యువతకి మీరు చేసిన అన్యాయం క్షమించరానిది, అందుకే మీ ఎమ్మెల్యేలు జనాల్లోకి వెళ్లాలంటే సిగ్గుపడుతున్నారు అంటూ నిప్పులు చెరిగారు.
"రూ.5 లక్షలకు పేపర్లు అమ్ముకున్నారని మీ మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. తాజా ఉద్యోగ నియామకాల్లో 90 శాతం వైసీపీ వాళ్లే ఉన్నారని విజయసాయిరెడ్డి కూడా కుండబద్దలు కొట్టేశాడు. ఇప్పటికైనా నోరు తెరిచి మాట్లాడండి జగన్ గారూ. కేవలం వైసీపీ కార్యకర్తల కళ్లలో ఆనందం చూడడం కోసమే పేపర్లు లీక్ చేశామని చెప్పండి జగన్ గారూ!" అంటూ ట్విట్టర్లో ఏకిపారేశారు. కళ్లెదురుగా ఇన్ని జరుగుతుంటే మౌనంగా ఎలా ఉంటారు? అంటూ ప్రశ్నించారు.