Telangana: దేశం ఆశ్చర్యపోయేలా కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తాం: సీఎం కేసీఆర్
- రెవెన్యూ శాఖలో అవకతవకలు ఎవరి పుణ్యం?
- వీఆర్వోలను తొలగిస్తామన్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దు
- రైతులకు ఎటువంటి ఇబ్బంది రానివ్వం
యావత్తు దేశం ఆశ్చర్యపోయేలా త్వరలోనే కొత్త రెవెన్యూ చట్టం తీసుకువస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చివరిరోజు సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెవెన్యూ శాఖలో అవకతవకలు ఎవరి పుణ్యం అంటూ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. వీఆర్వోలను తొలగిస్తాం అంటూ దుష్ప్రచారం చేయడం తగదని అన్నారు. వీఆర్వోలను తొలగించాల్సి వస్తే తొలగిస్తాం అని, పటేల్, పట్వారీ వ్యవస్థలు పోయిన విషయాన్ని కేసీఆర్ గుర్తుచేశారు.
రైతుల కోసం పనిచేస్తున్నామని, వారికి ఎటువంటి ఇబ్బంది రానివ్వమని స్పష్టం చేశారు. కౌలుదారుల అంశం.. అది రైతులకు కౌలుదారులకు మధ్య సంబంధం అని అన్నారు. కౌలుదారులను తమ ప్రభుత్వం గుర్తించదు అని స్పష్టం చేశారు. ఈ ఏడాది అన్నిరంగాల్లో ఆర్థిక మాంద్యం తీవ్రంగా ఉంటుందని అన్నారు. పన్నులు పెంచే, తగ్గించే అధికారం తమకు లేదని, కార్పొరేట్ ట్యాక్స్ ను కేంద్రం తగ్గించిందని, ఆ మేరకు రాష్ట్రాల వాటా తగ్గుతుందని చెప్పారు.
సర్పంచ్ లకు జాయింట్ చెక్ పవర్ కొనసాగుతుందని, ఉప సర్పంచ్ లను కలుపుకుని పోవాలని సర్పంచ్ లకు సూచించినట్టు చెప్పారు. సర్పంచ్ లను తొలగించే సమయంలో మంత్రులకు ఉన్న స్టే పవర్ ను తొలగించామని, సర్పంచ్ ల విషయంలో కలెక్టర్ లకు విశేష అధికారాలు ఇచ్చామని అన్నారు.