Krishna River: తగ్గిపోయిన వరద... నాగార్జున సాగర్ గేట్ల మూసివేత!
- కృష్ణా నదిలో గణనీయంగా తగ్గిన ప్రవాహం
- 48,990 క్యూసెక్కులుగా నమోదు
- గోదావరిలో కొనసాగుతున్న వరద
కృష్ణా నదిలో వరద ప్రవాహం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో నిన్నటి వరకూ తెరచివుంచిన నాగార్జున సాగర్ జలాశయం క్రస్ట్ గేట్లను అధికారులు మూసివేశారు. ప్రాజెక్టులోకి 48,990 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, కుడి, ఎడమ కాలువలకు, విద్యుత్ ఉత్పత్తికి ఆ నీటిని వినియోగిస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589.50 అడుగుల వరకూ నీరుంది.
ఇదిలావుండగా, గోదావరి నదిపై పెద్దపల్లి వద్ద సుందిళ్ల బ్యారేజ్ పూర్తిగా నిండిపోగా, రెండు గేట్లను ఎత్తివేశారు. మరోవైపు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కూడా 10 వేల క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. శ్రీరాంసాగర్ జలాశయానికి 84,738 క్యూసెక్కుల నీరు వస్తోంది.