krishna karakatta: కరకట్టపై నిర్మాణాల కూల్చివేతకు సిద్ధమవుతున్న సీఆర్‌డీఏ
- తొలివిడత చంద్రబాబు ఇంటితో సహా మరో నాలుగు
- మొత్తం 31 కట్టడాలు అక్రమమని గుర్తింపు
- మిగిలిన వాటికీ త్వరలో తుది నోటీసులు
కృష్ణానది కరకట్టపై ఉన్నవి అక్రమ నిర్మాణాలని చెబుతున్న జగన్ ప్రభుత్వం వాటిని కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని అతిథి గృహం ఒకటికాగా, శివస్వామి ఆశ్రమంలో ఉన్న రెండు కట్టడాలు, ఆక్వాడెవిల్స్ పేరుతో ఉన్న ఒక కట్టడం, మరో మూడంతస్తుల భవనం తొలి జాబితాలో ఉన్నాయి.
వీటికి తొలిసారి నోటీసులు జారీ చేసిన అధికారులు సంతృప్తికర సమాధానం లేకపోవడంతో నిన్న మరో విడత నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తొలివిడత 31 కట్టడాలకు సంబంధించి నోటీసులు జారీ చేసిన అధికారులు 20 కట్టడాలకు సంబంధించిన వాదనలు విన్నారు. ఇందులో ఈ ఐదు కట్టడాలను కూల్చివేయాలని నిర్ణయించి తుది నోటీసులు జారీ చేశారు. భవన నిర్మాతలే వాటిని కూల్చివేయాలని, లేదంటే సీఆర్‌డీఏ కూల్చివేస్తుందని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో వారం తర్వాత ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది.