Uttar Pradesh: పేకాటలో భార్యను పందెం కాసిన భర్త.. ఓడిపోవడంతో అతడి కళ్లముందే అత్యాచార యత్నం

  • మహాభారత ఘటనను గుర్తుకు తెచ్చిన ఘటన
  • భార్యాభర్తల గొడవంటూ నిందితులను వదిలేసిన పోలీసులు
  • తనకు న్యాయం కావాలంటున్న బాధితురాలు

ఉత్తరప్రదేశ్‌లోని కల్యాణ్‌పూర్‌లో జరిగిన ఓ ఘటన మహాభారతంలోని ఓ ఘట్టాన్ని గుర్తు చేసింది. కౌరవులతో జరిగిన జూదంలో చివరికి తమ భార్య ద్రౌపదిని ఒడ్డిన పాండవులు ఓటమి పాలవుతారు. ఓడిన పాండవులు నిస్సహాయంగా చూస్తుంటే ద్రౌపదిని నిండు సభలోకి లాక్కొచ్చిన దుర్యోధనుడి సోదరుడు దుశ్శాసనుడు ఆమెను వివస్త్రను చేసేందుకు ప్రయత్నిస్తాడు. అయితే, శ్రీకృష్ణుడి సాయంతో ఆమె ఆ గండం నుంచి బయటపడుతుంది.

తాజా ఘటనలో శ్రీకృష్ణుడులా ఎవరూ ఆమెను ఆదుకోకపోవడంతో ఆమె వారి చేతిలో అల్లరిపాలైంది. కల్యాణ్‌పూర్‌లో జరిగిన ఈ ఘటన సంచలనమైంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి జూదం, మాదక ద్రవ్యాలకు బానిసగా మారాడు. ఈ నెల 15న తన ఇంట్లోనే స్నేహితులతో కలిసి పేకాట మొదలెట్టాడు. చేతిలోని డబ్బంతా అయిపోయింది. ఆడడానికి సొత్తు కనిపించలేదు. చుట్టూ చూస్తే భార్య కనిపించింది. వెంటనే అతడి మదిలో చటుక్కున ఆలోచన మెరిసింది. వెంటనే భార్యను పందెం కాశాడు. ఆ ఆటలోనూ అతడు ఓటమి పాలయ్యాడు.

ఇక, స్నేహితుడి భార్యను గెలుచుకున్న మిగతా ఫ్రెండ్స్ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించారు. స్నేహితుడి ముందే అతడి భార్యపై అత్యాచారానికి యత్నించారు. ఓడిపోయి నిస్సహాయస్థితిలో ఉన్న భర్త వారి చెర నుంచి భార్యను రక్షించుకోలేకపోయాడు. అయితే, నిందితుల నుంచి ఎలాగోలా తప్పించుకుని బయటపడిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అయితే, పోలీసులు మాత్రం ఇది భార్యభర్తల గొడవంటూ నిందితులను వదిలిపెట్టారు. పోలీసుల తీరుపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధితురాలు మాత్రం తనకు న్యాయం కావాలని డిమాండ్ చేస్తోంది.

Uttar Pradesh
kalyanpur
crime
husband
  • Loading...

More Telugu News