Tirumala: తిరుమల తిరుపతా?.. తెలంగాణ తిరుపతా?: మండిపడుతున్న రాయలసీమ పోరాట సమితి!
- జంబో పాలకమండలిని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- బోర్డును రద్దు చేయాలన్న నవీన్ కుమార్ రెడ్డి
- నిరసనలు వ్యక్తం చేస్తున్న బీజేపీ
టీటీడీ దేవస్థానం పాలకమండలిని 26 మందితో ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో, రాయలసీమ పోరాట సమితి మండిపడింది. ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి పలువురికి స్థానం కల్పించగా, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తెలంగాణ తిరుపతి దేవస్థానంగా మార్చారని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ బోర్డును రద్దు చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.
భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమలపై కళంకితులకు చోటు కల్పించారని ఆయన ఓ ప్రకటనలో ఆరోపించారు. ఈ బోర్డు వద్దే వద్దని అన్నారు. కాగా, బీజేపీ సైతం బోర్డుపై నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీకి చెందిన దేవాలయంలో రాష్ట్రానికి చెందిన సభ్యులతో పోలిస్తే, ఇతర ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.