Nara Lokesh: చంకలు గుద్దుకోవడం కోసమే.. మతలబు అర్థమవుతోంది: లోకేశ్
- మ్యాక్స్ ఇన్‌ఫ్రాపై గతంలో సాక్షిలో వచ్చిన వార్తను పోస్టు చేసిన లోకేశ్
- అప్పుడు ఉట్టికి ఎగరలేని సంస్థ.. ఇప్పుడు స్వర్గానికి ఎలా ఎగురుతుందని ప్రశ్న
- ఒక్క శాతం కూడా పనులు చేయని సంస్థకు పనులా?
ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ మరోమారు విమర్శలు గుప్పించారు. ‘పోలవరం కుడి అనుసంధానం టన్నెల్‌లో మంత్రి మాయాజాలం’ అంటూ గతంలో సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన లోకేశ్.. వైసీపీ నేతల తీరు చూస్తుంటే ‘ఆలూ లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం’ అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. గతంలో గతంలో 4.77 శాతం ఎక్కువ టెండర్‌కు మ్యాక్స్ ఇన్‌ఫ్రా సంస్థ పనులు దక్కించుకుందని, ఇప్పుడు అవే పనులను 15.60శాతం తక్కువకు బిడ్ వేసిందంటేనే మతలబు ఏమిటో అర్థం చేసుకోవచ్చన్నారు.
రూ.58 కోట్లు మిగిల్చామని చంకలు గుద్దుకోవడం కోసమే ఇలా చేస్తున్నారా? అని లోకేశ్ ప్రశ్నించారు. అప్పుడు ఉట్టికి ఎగరలేనమ్మ ఇప్పుడు స్వర్గానికి ఎగురుతుందా? అని నిలదీశారు. మార్చిలో పనులు దక్కించుకుని ఒక్క శాతం పనులు కూడా పూర్తిచేయలేకపోయిన సంస్థకు ఇప్పుడు పనులు అప్పగించడం విడ్డూరంగా ఉందని లోకేశ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.